MS Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే.. మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే!-csk legend ms dhoni will wait couple months to take call his ipl retirement report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే.. మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే!

MS Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే.. మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 20, 2024 03:35 PM IST

MS Dhoni - IPL: ఐపీఎల్ 2024 సీజన్‍‍లో లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయింది. అయితే, ఇక ఐపీఎల్‍కు దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోనీ గుడ్‍బై చెబుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో టీమ్ మేనేజ్‍మెంట్‍కు చెందిన ఓ అధికారి కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. ఆ వివరాలివే..

MS Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే! మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే..
MS Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే! మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే.. (AP)

MS Dhoni - IPL: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. తన చివరి లీగ్ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో శనివారం (మే 18) ఓటమిపాలై సీఎస్‍కే ఎలిమినేట్ అయింది. రెండు జట్లకు 14 పాయింట్లే ఉన్నా మెరుగైన నెట్ రన్‍రేట్ సాధించిన బెంగళూరు ప్లేఆఫ్స్ చేరగా.. ఐదో స్థానంలో సీఎస్కే నిలిచింది. దీంతో ఐదుసార్లు చాంపియన్ చెన్నై ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది. అయితే, చెన్నై సీనియర్ స్టార్ ప్లేయర్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ సీజన్ చివరిదనే వాదనలు వినిపిస్తున్నాయి.

బెంగళూరుతో ఓటమి తర్వాత ధోనీ చాలా బాధగా ఉన్నట్టు కనిపించాడు. ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‍కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెంటనే రాంచీకి వెళ్లిపోయాడు. దీంతో ధోనీ ఇక ఐపీఎల్‍కు గుడ్‍బై చెబుతాడనే రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు నెలల సమయం కావాలని సీఎస్‍కే మేనేజ్‍మెంట్‍కు ధోనీ చెప్పాడని టైమ్స్ ఆఫ్స్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.

ధోనీ చెప్పింది ఇదే..

ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు వేచిచూస్తానని చెన్నై మేనేజ్‍మెంట్‍తో ధోనీ చెప్పాడట. “తాను వైదొలుగుతున్నట్టు సీఎస్‍కేలో ఎవరికీ ధోనీ చెప్పలేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు రెండు నెలలు వేచిచూస్తానని అతడు మేనేజ్‍మెంట్‍కు చెప్పాడు” అని సీఎస్‍కేకు చెందిన అఫీషియల్ ఒకరు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.

ధోనీ కబురు కోసం వేచిచూస్తాం

ధోనీ ఏం చేసినా జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆ అధికారి చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది. “వికెట్ల మధ్య పరుగెత్తుతున్నప్పుడు అతడు ఇబ్బంది పడలేదు. అది ప్లస్‍గా ఉంది. ధోనీ చెప్పే కబురు కోసం మేం వేచిచూస్తాం. జట్టు ప్రయోజనాలను అతడు నిరంతరం దృష్టిలో పెట్టుకుంటాడు” అని ఆయన చెప్పారు.

ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ దూకుడుగా ఆడాడు. 14 మ్యాచ్‍ల్లో 8సార్లు బ్యాటింగ్ చేసినా.. చివరిలోనే బరిలోకి దిగాడు. 73 బంతులు ఎదుర్కొని 161 పరుగులు సాధించాడు ధోనీ. ఏకంగా 220.55 స్టైట్‍తో మెరిపించాడు.

కెప్టెన్‍గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ ఐదు టైటిళ్లను అందించారు. ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్‌తో సమానంగా మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా నిలిపాడు. గతేడాది ధోనీ సారథ్యంలోనే చెన్నై ఐదో టైటిట్ కొట్టింది. దీంతో ఇక అతడు ఐపీఎల్‍కు గుడ్‍బై చెబుతాడనే పుకార్లు వచ్చాయి. అయితే, 2024 సీజన్ కూడా ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే, కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‍కు అప్పగించాడు. అతడికి ఈ సీజన్‍లో దిశా నిర్దేశం చేశాడు ధోనీ. అయితే, ప్లేఆఫ్స్ చేరకుండానే చెన్నై ఇంటిబాట పట్టింది. ధోనీకి ఇలాంటి వీడ్కోలు ఉండకూడదని, అతడు మరో సీజన్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‍లో 219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 201 పరుగులు చేసినా మెరుగైన నెట్ రన్‍రేట్‍తో ప్లేఆఫ్స్ చేరేది. అయితే, 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. ధోనీ చివరి ఓవర్లో భారీ సిక్స్ కొట్టినా.. తర్వాతి బంతికి ఔటయ్యాడు. చివరికి చెన్నై 191కే పరిమితమై.. బాధతో సీజన్ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరింది.

Whats_app_banner