YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షర్మిల సరికొత్త నిర్వచనం, యుద్ధం సిద్ధమంటూ సవాల్-ongole news in telugu appcc chief ys sharmila sensational comments on ys jagan ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షర్మిల సరికొత్త నిర్వచనం, యుద్ధం సిద్ధమంటూ సవాల్

YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షర్మిల సరికొత్త నిర్వచనం, యుద్ధం సిద్ధమంటూ సవాల్

Bandaru Satyaprasad HT Telugu
Jan 27, 2024 02:57 PM IST

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరన్నారు. వైఎస్ఆర్ పార్టీలో .. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila : వైసీపీకి తన రక్తం ధారపోశానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ నేతలంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో యుద్ధానికి రెడీ అని ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల... ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తుందన్నారు. వైసీపీలో వైఎస్ఆర్ లేరన్నారు. వైఎస్ఆర్ పార్టీలో .. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తీవ్ర విమర్శలు చేశారు.

ఆ మంత్రికి డ్యాన్స్ లే వచ్చు

మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్‌ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి డ్యాన్స్‌లు వేయడమే తప్ప, ప్రాజెక్టుల బాగోగులను చూడటం లేదని మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ నిర్మించారని, జగన్‌ హయాంలో కనీసం నిర్వహణ కూడా చేయలేకపోతున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ వారసులమని చెప్పుకుంటున్న వాళ్లు గుండ్లకమ్మ గేట్లు ఊడిపోయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వీళ్లా వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టేదంటూ విమర్శించారు. వైఎస్‌ఆర్ హయాంలో 70 శాతం పూర్తైన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని నిలదీశారు.

యుద్ధం సిద్ధం

వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీకి తొత్తులుగా మారాయని వైఎస్ షర్మిల విమర్శించారు. తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని గుర్తుచేశారు. ప్రజలకు న్యాయం జరగాలనే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చాయన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైసీపీని తన భుజాలపై మోశానన్నారు. ఇప్పుడు తనపై వైసీపీ ముప్పేట దాడి చేయిస్తుందన్నారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ యుద్ధానికి సిద్ధం సభపై షర్మిల ఫైర్ అయ్యారు. నేను యుద్ధానికి రెడీ, మీరు రెడీనా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగాలు వీటన్నింటితో పాటు రైతు రాజ్యం రావాలనే వైఎస్ఆర్ బిడ్డగా ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టానన్నారు.

జగన్ బీజేపీకి బానిస

వైసీపీ పాలనలో ఒక్క ఏడాదైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పారన్నారు. రూ.70 వేల కోట్ల విలువైన గంగవరం పోర్టు రూ.600 కోట్లకి అమ్మేశారని మండిపడ్డారు. ఏపీలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ తన వశం చేసుకుందన్నారు. బీజేపీకి బానిసగా మారిన జగన్... ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అని వైఎస్ షర్మిల తెలిపారు.