Rohit Sharma vs Star Sports: ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ-star sports reacted to rohit sharmas claim of no privacy for cricketers claim says this ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Vs Star Sports: ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ

Rohit Sharma vs Star Sports: ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
May 20, 2024 06:37 PM IST

Rohit Sharma vs Star Sports: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ స్పందించింది. క్రికెటర్ల జీవితాల్లో ప్రైవసీ లేకుండా పోతోందని, ప్రతిదీ రికార్డు చేసి టెలికాస్ట్ చేస్తున్నారని అతడు ఆరోపించిన విషయం తెలిసిందే.

ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ
ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ (AFP)

Rohit Sharma vs Star Sports: తన ప్రైవసీని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఉల్లంఘించిందని ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోపించిన సంగతి తెలుసు కదా. అంతటి ప్లేయరే ఇలాంటి ఆరోపణలు చేయడంతో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో వెంటనే స్పందించిన స్టార్ స్పోర్ట్స్ సోమవారం (మే 20) తమ వివరణ ఇచ్చింది.

స్టార్ స్పోర్ట్స్ ఏమన్నదంటే..

క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడే కాకుండా ట్రైనింగ్ సెషన్, ఫీల్డ్ బయట ప్లేయర్స్ మాట్లాడుకునే వాటిని కూడా బ్రాడ్‌కాస్టర్లు టెలికాస్ట్ చేస్తున్నారని, తాను వద్దని చెబుతున్నా స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియో అలాగే ప్లే చేయడం తన ప్రైవసీని ఉల్లంఘించడమే అని ఆదివారం (మే 19) రోహిత్ ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ తో రోహిత్ మాట్లాడిన వీడియో అది.

తాను వద్దని చెబుతున్నా వినలేదని రోహిత్ అనడం కాస్త తీవ్రమైన అంశమే. దీంతో రోహిత్ ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది. ఇది చూసి సదరు ఛానెల్ దిగి వచ్చింది. రోహిత్ మాటలను తాము టెలికాస్ట్ చేయలేదని, కేవలం వీడియో మాత్రమే చేశామని చెప్పింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

"ఓ సీనియర్ ఇండియన్ ప్లేయర్ ఉన్న వీడియో, అతని సోషల్ మీడియా పోస్ట్ నిన్నటి నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ క్లిప్ మే 16న వాంఖెడె స్టేడియంలో ట్రైనింగ్ సెషన్ సందర్భంగా తీసినది. దానికి స్టార్ స్పోర్ట్స్ కు అధికారిక అనుమతి ఉంది.

ఫ్రెండ్స్ తో ఆ సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్న వీడియోను ప్లే చేశాం. అతని సంభాషణకు సంబంధించి ఎలాంటి ఆడియో రికార్డు కానీ, బ్రాడ్‌కాస్ట్ గానీ చేయలేదు. స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షో లైవ్ కవరేజ్ లో ఆ వీడియోలో తమ సంభాషణను రికార్డు చేయొద్దని అతడు అడగడం మాత్రమే చూపించింది. అంతకుమించి ఏమీ లేదు" అని స్టార్ స్పోర్ట్స్ స్పష్టం చేసింది.

రోహిత్ చెబుతున్న వీడియో ఏంటి?

రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ మాట్లాడుతున్న ఆ వీడియోను మొదట కేకేఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సంభాషణలో ముంబై ఇండియన్స్ తో తన భవిష్యత్తు గురించి రోహిత్ మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆ వీడియోను తర్వాత కేకేఆర్ తొలగించింది. అంతలోపే ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

దీంతో రోహిత్ దీనిపై స్పందించాడు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్టార్ స్పోర్ట్స్ తన ప్రైవసీని ఉల్లంఘించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇలాంటి ప్రైవేట్ సంభాషణలను బ్రాడ్‌కాస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తుల్లో బ్రాడ్‌కాస్టర్లు, క్రికెటర్లు, అభిమానుల మధ్య విశ్వాసం సన్నగిల్లుతుందని కూడా రోహిత్ అన్నాడు. అయితే స్టార్ స్పోర్ట్స్ మాత్రం తాము ప్లేయర్స్ ప్రైవసీని గౌరవిస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చివరి స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ విషయంలో ఫ్రాంఛైజీతో విభేదాలు వచ్చిన నేపథ్యంలో వచ్చే సీజన్ కు రోహిత్ ముంబై నుంచి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఆ ఫ్రాంఛైజీ కూడా మెగా వేలం ముందు అతన్ని రిటెయిన్ చేసుకోకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner