లోక్​సభ ఎన్నికల ఫలితాలు.. ఫలితాల అనంతరం ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..-lok sabha election results 2024 live updates nda vs india modi latest news ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  లోక్​సభ ఎన్నికల ఫలితాలు.. ఫలితాల అనంతరం ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..

లోక్​సభ ఎన్నికల ఫలితాలు 2024..

లోక్​సభ ఎన్నికల ఫలితాలు.. ఫలితాల అనంతరం ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..

04:31 AM ISTJun 04, 2024 10:01 PM HT Telugu Desk
  • Share on Facebook
04:31 AM IST

  • 2024 Lok Sabha election results in Telugu: లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయమైంది. బీజేపీ ‘సొంత మెజారిటీ’ కోరిక తీరలేదు. 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Tue, 04 Jun 202404:31 PM IST

‘తల్లి లేని లోటు తెలియనివ్వలేదు’: ప్రధాని మోదీ

మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, వరుసగా మూడోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి చనిపోయిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు ఇవని గుర్తు చేసుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా మాతృమూర్తులు, సోదరీమణులు తనకు తల్లి లేని లోటును తెలియనివ్వలేదన్నారు.

Tue, 04 Jun 202403:29 PM IST

ఓటమి దిశగా తమిళ సై సౌందరరాజన్

బీజేపీ తరఫున తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఓటమి ముంగిట నిలిచారు. డీఎంకే అభ్యర్థి టీ సుమతి తమిళ సై పై 1.73 లక్షల మెజారిటీతో కొనసాగుతున్నారు.

Tue, 04 Jun 202403:21 PM IST

జూన్ 9 వరకు ‘రాష్ట్రపతి భవన్’ బంద్

జూన్ 5వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్ లోకి సామాన్యులు రావడానికి అనుమతించబోమని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ముగిసినందున, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

Tue, 04 Jun 202403:00 PM IST

‘‘శ్రీరాముడు’’ గెలిచాడు

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణ్ గోవిల్ విజయం సాధించారు. ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీత వర్మపై 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1987 లో దూరదర్శన్ లో టెలీకాస్ట్ అయిన ప్రముఖ సీరియల్ ‘రామాయణ్’ లో అరుణ్ గోవిల్ శ్రీరాముడి పాత్ర పోషించారు.

Tue, 04 Jun 202402:51 PM IST

ఫలితాల అనంతరం ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..

2024 లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ దాదాపు చివరకు వచ్చింది. జయాపజయాలపై క్లారిటీ వచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. గత పదేళ్లుగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామన్నారు. వరుసగా మూడో సారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపుతూ ఎక్స్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు.

Tue, 04 Jun 202401:48 PM IST

బెంగళూరు సౌత్ నుంచి తేజస్వీ సూర్య ఘన విజయం

బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలచిన తేజస్వీ సూర్య ఘన విజయం సాధించారు. బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య 2,77,083 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి పై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ, కేవలం 16 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు.

Tue, 04 Jun 202401:37 PM IST

వారణాసి నుంచి మోదీ ఘన విజయం; హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రధాని

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి గెలిచి, హ్యాట్రిక్ విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 1, 52,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఇదే స్థానం నుంచి మోదీ విజయం సాధించారు. 2014 లో మోదీ 4,79,505 ఓట్ల మెజారిటీతో, 2019 లో 3,71,784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Tue, 04 Jun 202401:24 PM IST

మండిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, స్థానిక నేత విక్రమాదిత్య సింగ్ పై ఆమె 74,755 ఓట్ల మెజారిటీ సాధించారు.

Tue, 04 Jun 202401:15 PM IST

మహారాష్ట్రలో ‘మహాయుతి’ పై ‘మహా వికాస్ అఘాడీ’ విజయం

మహారాష్ట్రలో ‘మహాయుతి’ పై ‘మహా వికాస్ అఘాడీ’ విజయం సాధించింది. మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం భాగస్వామ్యులుగా ఉన్నాయి. ‘మహా వికాస్ అఘాడీ’ లో కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ‘మహా వికాస్ అఘాడీ (MVA)’ 20 స్థానాల్లో, మహాయుతి 18 సీట్లలో మెజారిటీలో ఉన్నాయి. కాంగ్రెస్ 12, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 10, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 7 సీట్లలో ముందంజలో ఉన్నాయి. మహాయుతిలో బీజేపీ 11, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం 6, ఎన్సీపీ అజిత్ పవార్ 1 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

Tue, 04 Jun 202401:00 PM IST

పవార్ పరి‘వార్’ లో సుప్రియ సూలే వైపే మొగ్గు

మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో పవార్ ఫ్యామిలీ వార్ నెలకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన సుప్రియా సూలే, సునీత పవార్ ఈ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఇందులో సుప్రియా సూలే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూతురు కాగా, సునీత పవార్ ఎన్సీపీ ని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ భార్య. అయితే, వీరిద్దరి పోరులో సుప్రియా సూలే విజయం దిశగా వెళ్తున్నారు. ఆమె సాయంత్రం 5. గంటల సమయానికి సునీత పవార్ పై 32 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019 లో కూడా ఈ స్థానం నుంచి సుప్రియ గెలుపొందారు.

Tue, 04 Jun 202412:21 PM IST

నెమ్మదించిన కౌంటింగ్; ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఉత్తర ప్రదేశ్, బిహార్ తో పాటు దేశవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఒక్క సారిగా నెమ్మదించడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటకీ, ఆయా కౌంటింగ్ స్టేషన్లలోని అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. పోలింగ్ స్టేషన్ల నుంచి రియల్ టైమ్ డేటాను కూడా వెలువరించడం లేదని తెలిపింది. కౌంటింగ్ ప్రక్రియలో అనవసర జాప్యం లేకుండా చూడాలని కోరింది.

Tue, 04 Jun 202411:21 AM IST

ఎక్స్ లో ట్రెండింగ్ లో ‘‘యూపీ కే లడ్కే’’ హ్యాష్ ట్యాగ్..

ఎక్స్ (గతంలో ట్విటర్) లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ‘యూపీ కే లడ్కే (UP ke ladke)’. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లను ఉద్దేశించి ఈ హ్యాష్ ట్యాగ్ ను రూపొందించారు. యూపీలో వీరిద్దరి నేతృత్వంలో ఇండియా కూటమి 40 కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. దాంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీరిద్దరి నాయకత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఇది అఖిలేశ్ యాదవ్ విజయం మాత్రమేనని, ఇందులో రాహుల్ గాంధీ పాత్ర ఏమీ లేదని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tue, 04 Jun 202411:10 AM IST

‘అయోధ్య’ స్థానంలో గెలుపెవరిది?

ఉత్తర ప్రదేశ్ లోని 80 నియోజకవర్గాల్లో చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నది ఫైజాబాద్ స్థానాన్నే. ఈ ఫైజాబాద్ నియోజకవర్గం పరిధిలోకే ఇటీవల రామ మందిరాన్ని ఘనంగా పునర్నిర్మిం చిన అయోధ్య పట్టణం ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రారంభోత్సవాలను బీజేపీ, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా, అయోధ్య నెలకొని ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి దిశగా వెళ్తున్నాడు. ఈ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నాడు.

Tue, 04 Jun 202411:03 AM IST

జేడీయూ నితీశ్ మరొకసారి మోదీకి హ్యాండిస్తారా?

జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరొకసారి మోదీకి హ్యాండిస్తారా?.. తాను కీలక భూమిక వహించి రూపొందించిన విపక్ష కూటమి ‘ఇండియా’ లోకి తిరిగి వస్తారా?.. ఇండియా కూటమి నేతలు ఇప్పటికే నితీశ్ తో సంప్రదింపులు ప్రారంభించారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కొన్ని నెలల క్రితమే ఎన్డీయేలో చేరిన నితీశ్ ఇప్పటికిప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వెళ్లకపోవచ్చని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య తేడా సుమారు 50 సీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో, 15 సీట్ల చొప్పున ఎంపీ సీట్లు సాధించనున్న జేడీయూ నితీశ్, టీడీపీ చంద్రబాబు కింగ్ మేకర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tue, 04 Jun 202410:11 AM IST

నాటకీయ పరిణామాల మధ్య లీడ్ లోకి శశి థరూర్

కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం లోక్ సభ స్థానం కౌంటింగ్ లో అనూహ్య, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి రౌండ్లలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ లీడ్ లో కొనసాగారు. కానీ, కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ.. రాజీవ్ చంద్ర శేఖర్ లీడ్ తగ్గుతూ వచ్చింది. శశి ధరూర్ ఓట్ షేర్ పెరుగుతూ వచ్చింది. చివరకు శశిథరూర్ మధ్యాహ్నం 3.22 గంటల సమయానికి 15,974 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 2009 నుంచి ఈ సీటు నుంచి శశి థరూర్ విజయం సాధిస్తున్నారు.

Tue, 04 Jun 202409:53 AM IST

‘నోటా’ కు రెండు లక్షల ఓట్లు; ఎక్కడో తెలుసా?

బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చని పక్షంలో ఓటర్లు ‘నన్ ఆఫ్ ది ఎబవ్ - నోటా (NOTA)’ కు ఓటేయొచ్చు. అయితే, ఈ ఆప్షన్ ను చాలా కొద్దిమందే ఉపయోగించుకుంటున్నారు. కానీ, ఈ సారి మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ ఓటర్లు ‘నోటా’ కు రెండో స్థానం ఇచ్చారు. ఈ స్థానంలో నోటాకు 2,02,212 ఓట్లు లభించాయి. ఇండోర్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ తీసుకున్న అభ్యర్థి, ఆ తరువాత బీజేపీలో చేరడంతో, కాంగ్రెస్ ‘నోటా’ కు ఓటు వేయాలని ప్రచారం చేసింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి 11 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి.

Tue, 04 Jun 202409:46 AM IST

కేంద్రంలో ‘ఈక్వేషన్స్’ మారుతాయా?.. ఇండియా కూటమి పవర్ లోకి వచ్చే చాన్స్ ఉందా?

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మధ్య గెలిచిన సీట్ల సంఖ్యలో తేడా 50 కి మించనట్లయితే, ఇండియా కూటమికి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ, జేడీయూ, శివసేన (ఏక్ నాథ్ షిండే), ఎల్జేపీ లతో పాటు బిజూ జనతాదళ్ మద్దతు ఇస్తే, ఇండియా కూటమి అధికారంలోకి రావడం సాధ్యమేనని వారు విశ్లేషిస్తున్నారు.

Tue, 04 Jun 202409:00 AM IST

‘ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలి’

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన రిజల్ట్ ను బీజేపీ సాధించని నేపథ్యంలో.. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ డిమాండ్ చేశారు. బీజేపీ వైఫల్యాలకు మోదీ నైతిక బాధ్యత తీసుకోవాలన్నారు. మోదీ మాజీ ప్రధాని గా మారే సమయం వచ్చిందన్నారు. ఇండియా కూటమి ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు.

Tue, 04 Jun 202408:47 AM IST

‘దీదీ’ దే వెస్ట్ బెంగాల్; అభిషేక్ బెనర్జీ మెజారిటీ 5 లక్షలు

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం దిశగా వెళ్తోంది. పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 42 సీట్లలో 31 స్థానాల్లో మమత బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ మెజారిటీలో ఉంది. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ 5 లక్షల పై చిలుకు మెజారిటీతో ఉన్నారు.

Tue, 04 Jun 202408:39 AM IST

కశ్మీర్లో ఒమర్ అబ్దుల్లాను జైళ్లో నుంచే ఓడించిన ఇంజనీర్ రషీద్

జమ్మూకశ్మీర్లోని బారాముల్లా స్థానం నుంచి జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున పోటీ చేసిన, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓటమి పాలయ్యారు. ఒమర్ అబ్దుల్లాను తిహార్ జైళ్లో నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అబ్దుల్ రషీద్ షేక్ ఓడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద రషీద్ గత ఐదేళ్లుగా తిహార్ జైళ్లో ఉంటున్నారు. ఆయనను ఇంజనీర్ రషీద్ అని కూడా అంటారు.

Tue, 04 Jun 202408:08 AM IST

300 మార్క్ ను టచ్ చేసిన ఎన్డీయే

2024 లోక్ సభ ఎన్నికల్లో ఏన్డీయే మెజారిటీలో కొనసాగుతున్న స్థానాల సంఖ్య 300 కు చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి కూడా భారీ విజయాలను సాధిస్తోంది. మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి ఇండియా కూటమి 225 సీట్లలో మెజారిటీలో ఉంది. ఇతరలు 25 సీట్లలో ముందంజలో ఉన్నారు.

Tue, 04 Jun 202407:59 AM IST

అన్నామలై నుంచి స్మృతి ఇరానీ వరకు..

2024 లోక్​సభ ఎన్నికల్లో సంచలనం! 400 పార్​ నినాదంతో బరిలో దిగిన ఎన్​డీఏకి ఈసారి 300 సీట్లు కూడా రాకపోవచ్చని లోక్​సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్​ చూస్తుంటే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. బీజేపీ అగ్రనేతల్లో చాలా మంది ఓటమి అంచున నిలబడ్డారు. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 04 Jun 202407:51 AM IST

తమిళనాడులో క్లీన్ స్వీప్ దిశగా ‘ఇండియా కూటమి’

తమిళనాడులో ‘ఇండియా కూటమి’ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాల్లో 37 సీట్లలో ఇండియా కూటమి మెజారిటీలో ఉంది. ఇందులో డీఎంకే 21, కాంగ్రెస్ 8, సీపీఎం 2, సీపీఐ 2, ఐయూఎంఎల్ 1, ఎండీఎంకే 1, డీఎండీకే 1 సీట్లలో ముందంజలో ఉన్నాయి. కోయంబత్తూరు స్థానం నుంచి బరిలో ఉన్న బీజేపీ రాష్ర చీఫ్ అన్నామలై కూడా వెనుకంజలో ఉన్నారు.

Tue, 04 Jun 202407:08 AM IST

‘డ్రీమ్ గర్ల్’ కు భారీ మెజారిటీ

బాలీవుడ్ నటి, ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలిని భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మథుర స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న, 75 ఏళ్ల హేమ మాలిని సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముకేశ్ ధంగర్ పై 1,52,544 ఓట్ల మెజారిటీ (మధ్యాహం 12 గంటల సమయానికి) లో ఉన్నారు.

Tue, 04 Jun 202406:59 AM IST

రాజస్తాన్ లో టఫ్ ఫైట్

రాజస్తాన్ లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలను సాధిస్తోంది. ఇక్కడ ఉన్న మొత్తం 25 సీట్లలో 14 సీట్లలో బీజేపీ, 11 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్ లో ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ 8 సీట్లలో ముందంజలో ఉంది.

Tue, 04 Jun 202406:57 AM IST

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

2024 లోక్​సభ ఎన్నికలతో పాటు 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. మొత్తం 147 సీట్లకు పోలింగ్​ జరగ్గా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. అధికార బీజేడీ ఇక్కడ కేవలం 48 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ 13 చోట్ల లీడ్​లో ఉంది. ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కానీ.. బీజేడీకి షాక్​ ఇస్తూ.. ఒడిశాలో బీజేపీ 81 స్థానాల్లో దూసుకెళుతోంది. మెజారిటీ మార్క్​ 74 కన్నా ఇది ఎక్కువే. ఇదే ట్రెండ్​ కొనసాగితే.. 2000 తర్వాత.. ఒడిశాలో తొలిసారిగా బీజేడీయేతర పార్టీ అధికారంలోకి వస్తుంది.

Tue, 04 Jun 202406:33 AM IST

వారణాసిలో ప్రధాని మోదీ మెజారిటీ 60 వేలు

వారణాసిలో ప్రధాని మోదీ 60 వేల మెజారిటీతో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్లలో కాస్త వెనుకబడిన మోదీ, ఆ తరువాత విశేషంగా పుంజుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తొలి రౌండ్లలో మోదీపై 6 వేల మెజారిటీ కనబర్చారు. కానీ, ఆ తరువాత మోదీ పుంజుకుని, 60 వేల మెజారిటీలోకి వచ్చారు.

Tue, 04 Jun 202406:27 AM IST

వెనకంజలో ప్రజ్వల్​ రేవన్న..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్​ కుంభకోణం నిందితుడు, జేడీఎస్​ సస్పెండెడ్​ నేత, హసన్​ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున పోటీ చేసిన ప్రజ్వల్​ రేవన్న.. వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి శ్రేయస్ పటేల్​.. రేవన్న కన్నా 2,600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tue, 04 Jun 202406:26 AM IST

ఢిల్లీలో క్లన్ స్వీప్ దిశగా బీజేపీ

ఢిల్లీలోని మొత్తం 7 సీట్లలో బీజేపీ ముందంజ ఉండి, క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. కాంగ్రెస్ తరఫున ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన కన్హయ్య కుమార్ 47 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కన్హయ్య కుమార్ పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు.

Tue, 04 Jun 202406:23 AM IST

కింగ్​ మేకర్​గా చంద్రబాబు..!

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం! ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శన చేస్తూ.. అధికార ఎన్​డీఏకి టఫ్​ ఫైట్​ ఇస్తోంది విపక్ష ఇండియా కూటమి. ప్రస్తుత ట్రెండ్స్​ చూస్తుంటే.. కాంగ్రెస్​- ఇండియా కారణంగా.. బీజేపీ- ఎన్​డీఏకి ఊహించిన దాని కన్నా తక్కువ సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దేశ ప్రజల చూపు ఆంధ్రప్రదేశ్​పై పడింది. మరీ ముఖ్యంగా.. 2024 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు, లోక్​సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కింగ్​ మేకర్​ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 04 Jun 202406:22 AM IST

మళ్లీ కాంగ్రెస్ వైపే పంజాబ్

పంజాబ్ లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో మెజారిటీలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 13 లోక్ సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 7 స్థానాల్లో, ఆప్ 3 స్థానాల్లో, ఎస్ఏడీ 1 స్థానంలో, స్వతంత్రులు 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 2019 లో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో 8 సీట్లు గెల్చుకుంది.

Tue, 04 Jun 202406:01 AM IST

యూపీలో బీజేపీకి షాక్​..!

2024 లోక్​సభ ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం! బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమికి బలమైన పట్టు ఉన్న ఉత్తర్​ ప్రదేశ్​లో.. విపక్ష ఇండియా చాలా మెరుదైన ప్రదర్శన చేస్తోంది. అనూహ్యంగా.. బీజేపీకి సమాజ్​ వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 04 Jun 202405:49 AM IST

అమేఠీలో స్మృతీ ఇరానీ వెనకంజ!

అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వెనకంజలో ఉన్నారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్​ అభ్యర్థి కిషోరీ లాల్​.. దాదాపు 29,400 ఓట్ల మెజారిటీతో ముందు ఉన్నారు.

Tue, 04 Jun 202405:31 AM IST

ఒడిశాలో నవీన్​ పట్నాయక్​ పాలనకు తెర!

నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలో సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న బీజేడీ ప్రభుత్వానికి 2024 అసెంబ్లీ ఎన్నికలతో ముగింపు పడబోతున్నట్టు కనిపిస్తోంది. ట్రెండ్స్​ ప్రకారం.. 147 సీట్లల్లో బీజేపీ 67 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 36 చోట్ల లీడ్​లో ఉంది. మెజారిటీ మార్క్​ 74గా ఉంది.

Tue, 04 Jun 202405:29 AM IST

ఎన్డీయే 280, కాంగ్రెస్ 200 సీట్లలో లీడింగ్

ఎన్నికల సంఘం డేటా ప్రకారం, ఉదయం 10.30 గంటల వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 280 సీట్లలో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 200 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 234 సీట్లలో, కాంగ్రెస్ 100 సీట్లలో లీడ్ లో ఉంది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ 33 సీట్లలో లీడ్ లో ఉంది.

Tue, 04 Jun 202405:25 AM IST

శశి థరూర్​ వెనకంజ

కేరళ తిరువనంతపురంలో సిట్టింగ్​ ఎంపీ శశిథరూర్​ వెనకంజలో ఉన్నారు. ఎన్​డీఏ అభ్యర్థి లీడింగ్​లో ఉన్నారు.

Tue, 04 Jun 202405:24 AM IST

యూపీలో బీజేపీకి షాక్​ ఇస్తున్న ‘ఇండియా’!

ఉత్తర్​ ప్రదేశ్​లో బీజేపీ- ఎన్​డీఏ కూటమికి ఇండియా కూటమి నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఎన్​డీఏ 41 స్థానాల్లో లీడింగ్​లో ఉండగా.. సమాజ్​వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి 38 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక చోట లీడ్​ చేస్తున్నారు.

Tue, 04 Jun 202405:21 AM IST

మండిలో లీడ్ లో కంగన రనౌత్

హిమాచల్ ప్రదేశ్ లోని 4 లోక సభ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ 23,156 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అలాగే, హమీర్ పూర్ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ 50,152 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. కాంగ్ర స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ శర్మ 81,152 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

Tue, 04 Jun 202405:16 AM IST

ఎన్​డీఏ వర్సెస్​ ఇండియా..

ఉదయం 10:30 గంటలకు 543 సీట్లల్లో ఎన్​డీఏ కూటమి 284 సీట్లల్లో మెజారిటీలో ఉంది. మెజారిటీ మార్క్​ 272 కన్నా కాస్త ఎక్కువే. కానీ.. అందరిని షాక్​కు గురిచేస్తూ.. ఇండియా కూటమి 210 చోట్ల లీడింగ్​లో ఉంది.

ఇండియా కూటమిలో ఒక్క కాంగ్రెస్​ పార్టీనే 94 సీట్లల్లో లీడింగ్​లో ఉంది. 2014లో ఈ పార్టీ 44 సీట్లు దక్కించుకుంది. 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. కానీ ప్రస్తుత ట్రెండ్స్​ని చూస్తుంటే.. నాటి ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్​ కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి నెంబర్లు పెరగడం ఖాయంగా ఉందని సమచారం.

Tue, 04 Jun 202404:39 AM IST

రాహుల్​ లీడింగ్​

తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. తాను పోటీ చేసిన వయనాడ్​, రాయ్​బరేలీ నుంచి భారీ లీడింగ్​లో ఉన్నారు.

Tue, 04 Jun 202404:17 AM IST

వారణాసిలో మోదీ వెనకంజ..

యూపీ వారణాసిలో ప్రధాని మోదీ వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్​ అజయ్​ రాయ్​.. 11,480 ఓట్లతో ముందజంలో ఉన్నారు. మోదీకి.. 5257 సీట్లు వచ్చాయి.

Tue, 04 Jun 202403:57 AM IST

ముందంజలో ఎన్​డీఏ

ఉదయం 9:20 సమయానికి.. దేశవ్యాప్తంగా 214 నియోజకవర్గాల్లో ఎన్​డీఏ కూటమి లీడింగ్​లో ఉంది. విపక్ష ఇండియా కూటమి 165 చోట్ల ఆధిక్యంలో ఉంది.

Tue, 04 Jun 202403:52 AM IST

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

లోక్​సభ ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్ల నష్టంతో 75,166 వద్ద ఉంది. నిఫ్టీ.. 404 పాయింట్లు కోల్పోయి 22,859 వద్ద సెషన్​ని కొనసాగిస్తోంది. బ్యాంక్​ నిఫ్టీ.. 737 పాయింట్ల నష్టంతో 50,247 వద్ద ఉంది.

Tue, 04 Jun 202403:35 AM IST

గుజరాత్​లో..

గుజరాత్​లోని 28 సీట్లల్లో బీజేపీ 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ 4 స్థానాల్లో లీడింగ్​లో ఉంది.

Tue, 04 Jun 202403:32 AM IST

ఈవీఎంల ఓట్ల లెక్కింపు..

పోస్టల్​ బ్యాలెట్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైంది. చాలా ప్రాంతాల్లో కొద్ది సేపటి క్రితమే.. ఈవీఎలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

Tue, 04 Jun 202403:19 AM IST

తెలంగాణ లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

తెలంగాణలోని 5 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. వి.. కరీంనగర్​, మల్కాజ్​గిరి, సికింద్రాబాద్​, అదిలాబాద్​, నిజామాబాద్​.

ఇక అధికార కాంగ్రెస్​ పార్టీ.. 3 చోట్ల లీడింగ్​లో ఉంది.

ఎంఐఎం.. హైదరాబాద్​ నియోజకవర్గంలో ముందంజలో ఉంది.

Tue, 04 Jun 202403:18 AM IST

బెంగాల్​లో రసవత్తర పోరు..

లోక్​సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్​ వేళ.. పశ్చిమ్​ బెంగాల్​లో రసవత్తర పోరు కనిపిస్తోంది. అధికార టీఎంసీ- విపక్ష బీజేపీ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. 42 సీట్లకు గాను.. టీఎంసీ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 11 సీట్లల్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్​ 1 చోట లీడింగ్​లో ఉంది.

Tue, 04 Jun 202403:10 AM IST

లీడింగ్​లో కేంద్ర మంత్రులు..

ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు అమిత్​ షా, అనురాగ్​ ఠాకూర్​, రాజ్​నాథ్​ సింగ్​లు తమతమ నియోజకవర్గాల్లో లీడింగ్​లో ఉన్నారు. హిమాచల్​ ప్రదేశ్​ మండీ నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్​ సైతం ఆధిక్యంలో ఉన్నారు.

Tue, 04 Jun 202403:03 AM IST

ఉత్తర్​ ప్రదేశ్​లో బీజేపీ జోరు..

లోక్​సభ ఎన్నికల్లో గెలవాలంటే ఉత్తర్​ ప్రదేశ్​ చాలా కీలకం. ఇక్కడ అత్యధికంగా 40 సీట్లు ఉంటాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎర్లీ ట్రెండ్స్​లో ఇక్కడ ఎన్​డీఏ కూటమి 14 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. అఖిలేశ్​ యాదవ్​ 4 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు.

Tue, 04 Jun 202402:57 AM IST

ఎన్​డీఏ హవా..!

లోక్​సభ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్​లో ఎన్​డీఏ జోరు కనిపిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఎన్​డీఏ కూటమి 42 స్థానాల్లో లీడింగ్​లో ఉంది.

Tue, 04 Jun 202402:47 AM IST

ఆ రెండు రాష్ట్రాల్లో..

ఏపీ, ఒడిశాతో పాటు అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కింలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఆదివారమే వెలువడ్డాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ గెలిచింది. సిక్కింలో అధికార ఎస్​కేఎం సునామీ ముందు విపక్షాలేవీ నిలవలేకపోయాయి.

Tue, 04 Jun 202402:37 AM IST

543 కాదు.. 542

వాస్తవానికి నేడు 543 సీట్లకు పోలింగ్​ జరగాల్సి ఉంది. కానీ సూరత్​ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి ముకేశ్​ దలాల్​, ఏకగ్రీవంగా గెలుపొందడంతో.. ఎన్​డీఏ ఖాతాలో ఇప్పటికే ఒక సీటు చేరింది.

Tue, 04 Jun 202402:30 AM IST

లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

లోక్​సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ​ ప్రారంభమైంది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​లోని ఓట్లను లెక్కిస్తున్నారు.

Tue, 04 Jun 202402:24 AM IST

ఆలయాలకు అభ్యర్థులు..!

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. అభ్యర్థుల్లో చాలా మంది ఉదయాన్నే ఆలయాలను సందర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్​ అవుతున్నాయి.

Tue, 04 Jun 202402:21 AM IST

తెరుచుకున్న స్ట్రాంగ్​ రూమ్స్​..

Lok Sabha results : ఓట్ల లెక్కింపునకు ముందు.. దేశవ్యాప్తంగా సీల్​ వేసి ఉన్న స్ట్రాంగ్​ రూమ్స్​ తెరుచుకున్నాయి. ఇంకొన్ని నిమిషాల్లో పోస్టల్​ బ్యాలెట్​ లెక్కింపు ప్రక్రియ మొదలవ్వనుంది.

Tue, 04 Jun 202402:17 AM IST

ఒడిశాలో టఫ్​ ఫైట్​..

ఆంధ్ర ప్రదేశ్​తో పాటు ఒడిశాలోనూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ జరగనుంది. ఇక్కడ బీజేడీ- బీజేపీ మధ్య టఫ్​ ఫైట్​ కనిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. కేంద్రంలో ఈ రెండు పార్టీలు పరోక్షంగా మిత్రపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే!

Tue, 04 Jun 202402:14 AM IST

లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

ఇంకో 15 నిమిషాల్లో లోక్​సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్​ ప్రక్రియ మొదలుకానుంది. ఎర్లీ ట్రెండ్స్​ వచ్చాక ఒక క్లారిటీ వస్తుంది.

Tue, 04 Jun 202401:38 AM IST

దిల్లీ ప్రధాన కార్యాలయంలో హడావుడీ..

Lok Sabha elections BJP : ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు నిజమవుతాయని విశ్వాసంతో ఉన్న బీజేపీ శ్రేణులు.. సంబరాలు చేసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా.. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళుతున్నారు. వారందరి కోసం పూరీలు, స్వీట్లను సిద్ధం చేస్తున్నారు.

Tue, 04 Jun 202401:16 AM IST

కట్టుదిట్టమైన భద్రత..

Election Counting : ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. లోపల ఎన్నికల సిబ్బంది, బయట భారీ సెక్యూరిటీతో ఓట్ల లెక్కింపు కేంద్రాలు కిటకిటలాడిపోతున్నాయి.

Tue, 04 Jun 202412:57 AM IST

Lok Sabha elections : ఈ సీట్లల్లో రసవత్తర పోరు..!

కోయంబత్తూర్​:- బీజేపీ అన్నామళై వర్సెస్​ డీఎంకే గణపతి వర్సెస్ ఏఐఏడీఎంకే​ సింగై రామచంద్రన్

మండి:- బీజేపీ కంగనా రనౌత్​ వర్సెస్​ కాంగ్రెస్​ విక్రమాదిత్య

తిరువనంతపురం:- కాంగ్రెస్​ శశి థరూర్​ వర్సెస్​ బీజేపీ రాజీవ్​ చంద్రశేఖర్​

థ్రిసూర్​:- బీజేపీ సురేశ్​ గోపీ వర్సెస్​ కాంగ్రెస్​ కే మురళీధరన్​ వర్సెస్​ సీపీఐ వీఎస్​ సునీల్

నార్త్​ వెస్ట్​ దిల్లీ:- కాంగ్రెస్​ కన్నయ్య కుమార్​ వర్సెస్​ బీజేపీ మనోజ్​ తివారి.

Tue, 04 Jun 202412:32 AM IST

లోక్​సభలో సీట్లు..

లోక్​సభలో మొత్తం 545 సీట్లుంటాయి. వీటిల్లో 543 సీట్లకు పోలింగ్​ జరిగింది. మెజారిటీ మార్క్​ 272. గత రెండు ఎన్నికల్లో.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్​ని దాటి, సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్​ మాత్రం.. 2014లో 44, 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. మరి ఈసారి కాంగ్రెస్​ సీట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tue, 04 Jun 202412:18 AM IST

ఎన్​డీఏ 400 దాటుతుందా?

లోక్​సభ ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్​డీఏ 400 దాటుతుందా? అని ఇప్పుడు అసలు ప్రశ్న అని అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్​ పోల్స్​ మాత్రం.. ఎన్​డీఏ 400 దాటకపోవచ్చని సూచిస్తున్నాయి.

Tue, 04 Jun 202411:56 PM IST

మోదీ 3.0 వర్సెస్​ ఇండియా..

ఈ లోక్​సభ ఎన్నికల సమరం మోదీ వర్సెస్​ ఇండియా కూటమి మధ్య జరిగింది. మూడోసారి గెలిచి అధికారం చేపట్టాలని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ధృడ సంకల్పంతో ఉంది. మోదీని గద్దెదించందుకు విపక్ష ఇండియ కూటమి తన వంతు ప్రయత్నం చేసింది. మరి ఈ సమరంలో ఎవరు గెలుస్తారో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

Tue, 04 Jun 202411:54 PM IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

లోక్​సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్​, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం నేడు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లైవ్​ అప్డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 04 Jun 202411:53 PM IST

8 గంటలకు కౌంటింగ్​..

మంగళవారం ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​లోని ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.

Tue, 04 Jun 202411:51 PM IST

నేడే లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది! 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో ప్రారంభంకానుంది.