Hyderabad loksabha: గ్రేటర్‌‌లో కాంగ్రెస్‌‌కు ఎదురుదెబ్బ, సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కోల్పోయారు-a setback for the congress in greater the sitting mp also lost the seat ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Loksabha: గ్రేటర్‌‌లో కాంగ్రెస్‌‌కు ఎదురుదెబ్బ, సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కోల్పోయారు

Hyderabad loksabha: గ్రేటర్‌‌లో కాంగ్రెస్‌‌కు ఎదురుదెబ్బ, సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కోల్పోయారు

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 08:04 AM IST

Hyderabad loksabha: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కూడా హస్తం పార్టీ కోల్పోయింది.

గ్రేటర్‌లో సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్
గ్రేటర్‌లో సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్

Hyderabad loksabha: గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయ ఢంకా మోగించిన హస్తం పార్టీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం కనీసం ఖాతా తెరవకలేక పోయింది. ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఆ పార్టీ.....లోక్ సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టత్మకంగా తీసుకుంది.

ఎలాగైనా గ్రేటర్ లో తమ పట్టు నిలుపుకోవాలని అనుకున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్,సికింద్రబాద్,చేవెళ్ల మరియు మల్కాజిగిరి....మొత్తం నాలుగు స్థానాలకు గాను కనీసం రెండు నుంచి మూడు స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరు వేయాలని భావించారు.

కానీ గ్రేటర్ ప్రజలు మరోసారి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీకే జై కొట్టారు. సిఎం రేవంత్ సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ నిలుపుకోలేక పోయింది.

సికింద్రబాద్,చేవెళ్ల మరియు మల్కాజిగిరి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. చేవెళ్ల మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం అయింది. ఎప్పటిలాగే హైదరాబాద్ లో మజ్లిస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మధవలిత పై దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సిఎం రేవంత్ కు గట్టి షాక్

2018 శాసన సభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అయన తిరిగి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. ఈ పదవి నుంచి ఏకంగా టిపిసిసి పదవి దక్కించుకున్న రేవంత్ కు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కలిసొచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు.

అయితే తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చేవెళ్ల స్థానానికి సిఎం రేవంత్ ఇంచార్జీ గా వ్యవహరించినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు.

బిఆర్ఎస్ తరఫున సీటు ఖరారు అయిన తరువాత కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి ఘోర ఓటమిని చెవి చూశారు.ఇక మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన వికారాబాద్ జెడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీత

మహేందర్ రెడ్డి సైతం ఘోరంగా ఓడిపోయారు. ఈ స్థానంలో ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేకపోయారు.అటు సిఎం సొంత జిల్లా అయిన మహబూబ్ నాగర్ లోనూ రేవంత్ కు భారీ షాక్ తగిలింది.

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశి చంద్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అంతకముందు అదే మహబూబ్ నాగర్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ కు ఎదురు దెబ్బే తగిలింది. అక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.

మంత్రి కోమటిరెడ్డిది కూడా ఇదే పరిస్థితి

శాసన సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో అతనికి సికింద్రాబాద్ లోక్ సభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఎమ్మెల్యే ఎన్నికల్లో దానంను గెలిపించిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా ఓడించారు.

దానంపై బీజేపీ రాష్ట్ర కిషన్ రెడ్డి దాదాపు 50 వేల మెజారిటీతో గెలుపొందారు. అయితే సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నా......కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించ లేక పోయారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కోల్పోయిన పట్టును తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో సాధించాలని అనుకున్న ఫలితం లేకుండా పోయింది.

( రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

సంబంధిత కథనం