PAK vs BAN: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్.. చరిత్ర సృష్టించిన టీమ్
PAK vs BAN 1st Test: పాకిస్థాన్‍పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. రావల్పిండిలో జరిగిన టెస్టులో పాక్‍ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో చరిత్ర సృష్టించింది బంగ్లా టీమ్.
పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ రెచ్చిపోయింది. తొలి టెస్టులో పాక్‍ను బంగ్లా చిత్తుచిత్తుగా ఓడించింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే గెలిచింది. చరిత్ర సృష్టించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‍పై ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో సత్తాచాటి దుమ్మురేపింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన పాక్ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలి మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఆగస్టు 25) పరాజయం పాలైంది.
డిక్లేర్ చేసిన పాక్.. దుమ్మురేపిన బంగ్లా
ఈ తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సౌద్ షకీల్ (141), మహమ్మద్ రిజ్వాన్ (171) శతకాలతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కూడా దుమ్మురేపింది. ఏకంగా 565 పరుగులు చేసింది. బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్పికర్ రహీమ్ 191 పరుగులతో రెచ్చిపోయాడు. కాస్తలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. షాద్‍మాన్ ఇస్లాం (93), మెహదీ హసన్ మిరాజ్ (77), లిటన్ దాస్ (56), మోమినుల్ హక్ (50) రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 117 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పాక్ కుప్పకూలిపోయింది.
బంగ్లా స్పిన్‍కు పాక్ టపటపా
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నేడు పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. నేడు 146 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ రిజ్వాన్ (51), అబ్దుల్లా షఫీక్ (37) మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే ఔటయ్యారు. బంగ్లాదేశ్ స్పిన్నర్లు మెహిదీ హసన్ మిరాజ్ నాలుగు, షకీబల్ హసన్ మూడు వికెట్లతో విజృంభించారు. దీంతో పాకిస్థాన్ టపటపా వికెట్లను కోల్పోయింది. బాబర్ ఆజమ్ (22), టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ (14) కూడా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహిద్ రాణా కూడా చెరో వికెట్ తీసుకున్నారు.
స్వల్ప లక్ష్యాన్ని ఊదేసిన బంగ్లా
రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలి బంగ్లాదేశ్‍కు కేవలం 30 పరుగుల లక్ష్యం మాత్రమే ఇచ్చింది పాకిస్థాన్. ఈ స్వల్ప లక్ష్యాన్ని అరగంటలోనే 6.3 ఓవర్లలో ఊదేసింది బంగ్లా. ఓపెనర్లు జకీర్ హసన్ (15), షాద్‍మాన్ ఇస్లాం (9) అజేయంగా నిలిచి వికెట్ పడకుండా టీమ్‍ను గెలిపించారు. దీంతో 10 వికెట్ల తేడాతో నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లా విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వచ్చేసింది.
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
టెస్టు క్రికెట్‍లో పాకిస్థాన్‍పై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. అలాగే, పాకిస్థాన్‍ను వారి దేశంలో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి టీమ్‍గానూ బంగ్లా రికార్డు దక్కించుకుంది. 2021 ఫిబ్రవరి తర్వాత సొంతగడ్డపై ఒక్క టెస్టు కూడా గెలువలని పాకిస్థాన్.. దాన్ని కొనసాగించింది. బంగ్లాదేశ్ చేతిలోనూ చిత్తుగా ఓడింది.
గతేడాది వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లోనూ గ్రూప్ స్టేజ్‍లో నిష్క్రమించింది. ఇప్పుడు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టులో చిత్తుగా ఓడింది. ఇలా పాక్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.