Pakistan Cricket Team: అభిమానులకు భయపడి పాకిస్థాన్‌కు వెళ్లని బాబర్ ఆజం.. ఆ ఐదుగురు కూడా..!
Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంతోపాటు మరో ఐదుగురు ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ లో తమ పని ముగిసిన తర్వాత కూడా ఇంటికెళ్లలేదు. అభిమానులకు భయపడే ఈ పని చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మరో మెగా టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ దశలోనే ఇండియా, యూఎస్ఏ చేతుల్లో ఓడిన పాక్.. సూపర్ 8కు చేరని విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత కెప్టెన్ బాబర్ ఆజంతోపాటు మరో ఐదుగురు ప్లేయర్స్ ఇంటికి వెళ్లలేదు. వీళ్లు లండన్ లో దిగి అక్కడే ఉన్నారు.
పాక్ ప్లేయర్స్ అందుకే వెళ్లలేదా?
పాకిస్థాన్ ప్లేయర్స్ ఇంటికి వెళ్లకపోవడానికి అభిమానుల భయమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాబర్ ఆజంతోపాటు మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, హరీష్ రౌఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ లాంటి వాళ్లు లండన్ లో ఉండి కాస్త రిలాక్స్ కానున్నట్లు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల పాటు అక్కడే గడిపిన తర్వాత పాకిస్థాన్ కు తిరిగి వెళ్లనున్నట్లు తెలిసింది.
గతేడాది వన్డే వరల్డ్ కప్ తొలి రౌండ్ నుంచే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ అదే పరిస్థితి ఎదురు కావడంతో తమ టీమ్ పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లయితే బాబర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో ఈ ఆరుగురు ప్లేయర్స్ లండన్ లోనే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీళ్లలో కొందరు స్థానిక క్రికెట్ లీగ్స్ లో పాల్గొననున్నట్లు కూడా చెబుతున్నారు. యూకే స్థానిక మీడియా కూడా పాక్ ప్లేయర్స్ అక్కడి లీగ్ లలో పాల్గొనే విషయాన్ని ధృవీకరించింది. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికిప్పుడే టోర్నీలు కూడా లేకపోవడంతో ప్లేయర్స్ తాము కావాలనుకున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చే వీలు కల్పించింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్
టీ20 వరల్డ్ కప్ లో తొలి రౌండ్లోనే పాక్ ఇంటికెళ్లిపోవడం ఇదే తొలిసారి. నిజానికి ఈ మెగా టోర్నీలో అత్యంత నిలకడైన జట్టుగా పాక్ కు పేరుంది. కానీ ఈసారి మాత్రం తొలి మ్యాచ్ లోనే యూఎస్ఏ చేతుల్లో ఓటమి, తర్వాత ఇండియాతోనూ ఓడిపోవడంతో సూపర్ 8 అవకాశాలు క్లిష్టమయ్యాయి. తర్వాత యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో పాక్ లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది.
కెనడా, ఐర్లాండ్ లపై గెలిచినా.. ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ ఇక ఆగస్ట్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అంతవరకు ఎలాంటి సిరీస్ లు లేవు. తర్వాత అక్టోబర్ లో పాకిస్థాన్ టూర్ కు ఇంగ్లండ్ రానుంది. సుమారు నెలన్నర రోజుల పాటు ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు లేకపోడంతో బాబర్ ఆజం, ఇతర టీమ్ సభ్యులు లండన్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక కెప్టెన్ గా బాబర్ ఆజం భవిష్యత్తు తేలాల్సి ఉంది. తనకు తానుగా అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా లేక పీసీబీ ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.