Bhagwant Mann: 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్..
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గుర్ప్రీత్ కౌర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో భార్య.
Bhagwant Mann becomes proud father: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పాటు నవజాత శిశువు ఫోటోను భగవంత్ మాన్ షేర్ చేశాడు. ‘‘సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భగవంత్ మాన్ పంజాబీలో 'ఎక్స్'లో (గతంలో ట్విటర్) పేర్కొన్నారు. మరో పోస్టులో 50 ఏళ్ల మాన్ తన చిన్న బిడ్డ ఫోటోను షేర్ చేశారు. భగవంత్ మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. మాన్ కు ఆ వివాహం ద్వారా ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. వీరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022 లో సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.
2015 నుంచి సీఎంగా..
మాజీ కమెడియన్, నటుడు అయిన మాన్ (Bhagwant Mann) 2015 లో తన మొదటి భార్య ఇందర్ప్రీత్ కౌర్ నుండి విడిపోయిన తరువాత 2022 లో డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. 2008 లో "గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్" అనే టెలివిజన్ షోలో కనిపించిన తరువాత అతని ప్రజాదరణ పెరిగింది. ఆ తరువాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరారు. అనంతరం, భగవంత్ మాన్ 2022 మార్చిలో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆప్ (AAP) నిర్వహించిన పబ్లిక్ పోల్ ఆధారంగా ఆయనను సీఎం పదవికి ఎంపిక చేశారు.
విమర్శలు కూడా..
ఇటీవల పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 20 మంది మృతి చెందడంపై భగవంత్ మాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం, ఆయన సంగ్రూర్ జిల్లాలోని గుజ్రాన్ గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. తమ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ భగవంత్ మాన్ గత వారం ఢిల్లీకి వచ్చారు.