World Heart day: మహిళల్లో గుండె పోటు లక్షణాలు, కారణాలు ఇవే.. వీటిని నిర్లక్ష్యం చేయకండి.-on world heart day know heart disease symptoms in women know reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Heart Day: మహిళల్లో గుండె పోటు లక్షణాలు, కారణాలు ఇవే.. వీటిని నిర్లక్ష్యం చేయకండి.

World Heart day: మహిళల్లో గుండె పోటు లక్షణాలు, కారణాలు ఇవే.. వీటిని నిర్లక్ష్యం చేయకండి.

Koutik Pranaya Sree HT Telugu
Sep 29, 2024 05:00 AM IST

Women' Heart Health: మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. సెప్టెండర్ 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆ లక్షణాలేంటో, మహిళల్లో గుండె జబ్బులకు కారణాలు, నివారణ చర్యల గురించి తెల్సుకోండి.

మహిళల్లో గుండెపోటు కారణాలు, నివారణ మార్గాలు
మహిళల్లో గుండెపోటు కారణాలు, నివారణ మార్గాలు

గుండె జబ్బు పేరు చెప్పగానే ఎందుకోగానీ కేవలం పురుషులకే వచ్చేదని పరిగణిస్తారు చాలా మంది. కానీ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణానికి అత్యంత సాధారణ కారణాలలో ఇదీ ఒకటి. మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు, ప్రమాదాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి మహిళలు వీటి గురించి అవగాహనతో ఉండటం అత్యవసరం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం, భారతీయ మహిళల్లో మరణానికి ప్రధాన కారణాలలో గుండె జబ్బు కూడా ఒకటి. సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే సందర్బంగా మహిళల్లో ఈ జబ్బుకు కారణాలు, లక్షణాలు, నివారణ చర్యల గురించి తెల్సుకోండి.

భారతీయ మహిళల్లో 18 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఈ సంఖ్య రొమ్ము క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల సమష్టి సంఖ్య కంటే ఎక్కువ. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, భారతీయ మహిళల్లో కొరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే గుండె ధమనులలో రక్త ప్రవాహంలో సమస్య వివిధ వయస్సుల మహిళల్లో 3 నుండి 13 శాతం మధ్య ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఈ సమస్య 300 శాతం పెరిగినట్లు.

భారతీయ మహిళల్లో గుండెపోటు వస్తున్న వారి సగటు వయస్సు 59 సంవత్సరాలు. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మహిళలు తమ గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

గుండె పోటు లక్షణాలు:

మహిళల్లో, ఈ వ్యాధుల లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. గుండె జబ్బు సాధారణ లక్షణం ఛాతీ నొప్పి అనుకుంటాం. కానీ మహిళలు గుండె జబ్బులతో ఉన్నప్పుడు వికారం, శ్వాస ఆడకపోవడం, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ఇవన్నీ గుండె జబ్బుకు కారణాలని అనుకోరు. నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తుంది.

మహిళల్లో గుండె జబ్బులకు కారణాలు:

మెనోపాజ్:

మెనోపాజ్ గుండె జబ్బులను కలిగించదు. అయితే, ఈ సమయంలో కొన్ని ప్రమాద కారకాలు మాత్రం పెరుగుతాయి. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం మహిళల్లో గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గుండె గోడ లోపలి పొరను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పిల్లల్ని కనని మహిళల్లో, అలాగే చాలా తక్కువ వయసులో మెనోపాజ్ మొదలైన వాళ్లలోనూ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గర్భధారణ సంబంధిత సమస్యలు:

ప్రెగ్నెన్సీలో వచ్చే మధుమేహం, ప్రీక్లాంప్సియా.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భధారణలో ఈ సమస్యలున్నవాళ్లు గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే గర్భస్రావాలు ఎక్కువగా జరిగిన మహిళల్లోనూ (అధిక హోమోసిస్టీన్ స్థాయిలు ఉన్నవారితో సహా) గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిస్:

డయాబెటిస్ వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ కారణంగా అధిక చక్కెర స్థాయులు దీర్ఘకాలంలో గుండె, రక్తా నాళాలు, నరాల మీద ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్న 30 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఈ వయస్సులో పురుషుల కంటే గుండె ఆగిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ.

నివారణ మార్గాలు:

మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెజబ్బులను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా గుండె జబ్బులకు కారణాలను గణనీయంగా తగ్గించవచ్చు.

సమతుల్య ఆహారం:

గుండె ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది.

వ్యాయామం:

గుండె జబ్బుల నివారణలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం గుండెను దృఢంగా మార్చడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

ఒత్తిడి:

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఒత్తిడిని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. నిరంతర ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. దానిని అధిగమించడానికి, అతిగా తినడం, ధూమపానం లేదా మద్యం సేవించడం వంటి అలవాట్లను మానుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, టీ, కాఫీ, ధూమపానం లేదా ఆల్కహాల్ తాగడానికి బదులుగా ధ్యానం, యోగాసనం లేదా ప్రాణాయామం చేయండి.

కొలెస్ట్రాల్:

గుండె జబ్బులను నివారించడానికి రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం. అధిక రక్తపోటు ఒక సైలెంట్ కిల్లర్. ఇది ఎటువంటి లక్షణాలను చూపించకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

బరువు:

బరువును అదుపులో ఉంచుకోవడం కూడా గుండె జబ్బులను నివారించడానికి సులభమైన మార్గం. అధిక బరువు, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆరోగ్య పరీక్షలు:

సకాలంలో రోగ నిర్ధారణ చేయడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు. మహిళలు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి వారి రక్తపోటు, కొలెస్ట్రాల్ డయాబెటిస్‌తో పాటు బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్ఐ) చెక్ చేసుకోవాలి.