High Cholesterol Symptoms: చేతులు, కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు, అవి అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలు
High Cholesterol Symptoms: అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇది గుండె జబ్బులకు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తోంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను ముందే గుర్తించవచ్చు.
High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఇది. ప్రాణాంతక సమస్యలకు కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే కొవ్వు పదార్థం. ఇది కణాలు నిర్మించడానికి అత్యవసరం. కానీ ఇది అవసరానికి మించి పేరుకు పోతే తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ప్రోటీన్‌లతో కలిసి రక్తం ద్వారా ప్రవహిస్తాయి. ఈ ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ కలిసి ఉన్న పదార్థాలను లిపో ప్రోటీన్లు అంటారు.
మీ శరీరం అంతటా కొలెస్ట్రాల్‌ను తీసుకువెళ్లే రెండు రకాల లిపో ప్రోటీన్లు ఉంటాయి. అవి LDL, HDL. LDLను చెడు కొలెస్ట్రాల్ గా సూచిస్తారు. ఇది ధమనులలో కొవ్వుగా పేరుకుపోతుంది. రక్త ప్రవాహానికి అడ్డు తగులుతుంది. ఇక రెండోది మంచి కొలెస్ట్రాల్ (HDL). ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను కాలేయానికి తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది. అక్కడే ఈ మంచి కొలెస్ట్రాల్ ప్రాసెస్ జరిగి శరీరం నుంచి బయటికి పోతుంది. అందుకే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉండాలి. కానీ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయిన విషయాన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా చేతులు కాళ్లపై ఈ కొలెస్ట్రాల్ లక్షణాలు అధికంగా పడుతూ ఉంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తాయి
పిడికిలి, అరచేతులపై పసుపు లేదా నారింజ రంగులో చిన్న గడ్డలుగా పేరుకు పోతే అవి కొవ్వు నిల్వలని అర్థం చేసుకోవాలి. అలాగే కాళ్ల పై, మోకాళ్ళపై, పిరుదులపై కూడా ఈ గడ్డలు పెరుగుపోవచ్చు. ఇవి చేత్తో తాకితే మృదువుగా ఉంటాయి. వీటి పరిమాణం మిల్లీమీటర్ల నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు.
కంటిలోని కార్నియా చుట్టూ బూడిద లేదా తెలుపు రంగులో ఆర్క్ ఆకారం కనిపిస్తుంది. ఇది కూడా అధిక కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. అలాగే గోళ్లలో రంగు మారడం లేదా నీలిరంగులోకి కనిపించడం వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలే. అధిక కొలెస్ట్రాల్ వల్ల చేతులకు, కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల ఆ రెండు చోట్ల ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గోళ్లు పెళుసుగా మారతాయి. కాలిగోళ్ళు ఆరోగ్యంగా లేకపోవడం అనేది రక్తప్రసరణ తక్కువగా అవుతోందని సూచిస్తాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ ప్రభావమని అర్థం చేసుకోవాలి.
కాళ్లలో కనిపించే లక్షణాలు
మెట్లు ఎక్కడం, దిగడం వంటి సమయాల్లో కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి అధికంగా ఉంటుంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. శరీరంలో ఇతర భాగాలతో పోలిస్తే కాళ్లల్లోనే తిమ్మిరి అధికంగా వస్తుంది. బలహీనంగా అనిపిస్తుంది. అలాగే పాదాలు, కాళ్లపై పుండ్లు, గాయాలు వంటివి వచ్చినా అవి అంత త్వరగా తగ్గవు. ఇవన్నీ కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలగానే భావించాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్ల అక్కడికి రక్త ప్రసరణ సవ్యంగా జరగక ఈ మార్పులు కనిపిస్తాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ లేకుండా చూసుకోవాలి. పండ్లు కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినాలి. అవిసె గింజలు, సాల్మన్ చేపలు తినడం వల్ల కొవ్వు ఆమ్లాలు శరీరంలో చేరుతాయి. వారానికి కనీసం రెండు రోజులైనా వ్యాయామం చేయాలి. ప్రతి వారం 150 నిమిషాలు పాటు ఏరోబిక్ యాక్టివిటీలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. తరచూ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ఉత్తమం. కొలెస్ట్రాల్ మరీ పెరిగిపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
టాపిక్