Crime news: మహిళను తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు దోపిడీ చేసిన క్యాబ్ డ్రైవర్-blusmart cab driver robs woman at gunpoint company deeply saddened ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: మహిళను తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు దోపిడీ చేసిన క్యాబ్ డ్రైవర్

Crime news: మహిళను తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు దోపిడీ చేసిన క్యాబ్ డ్రైవర్

Sudarshan V HT Telugu
Dec 03, 2024 07:10 PM IST

Crime news: తన క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఒక మహిళను, ఆమె కుమారుడిని తుపాకీతో బెదిరించి వారి వద్ద నుంచి డబ్బు, నగలను ఆ క్యాబ్ డ్రైవర్ దోపిడీ చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్ లో శుక్రవారం రాత్రి జరిగింది. ఆ క్యాబ్ బ్లూస్మార్ట్ క్యాబ్ సర్వీసెస్ కు చెందినది.

మహిళను తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు దోపిడీ చేసిన క్యాబ్ డ్రైవర్
మహిళను తుపాకీతో బెదిరించి డబ్బు, నగలు దోపిడీ చేసిన క్యాబ్ డ్రైవర్ (Reuters)

Crime news: గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడిని డ్రైవర్ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు. రూ.55వేలు తన ఖాతాలో జమ చేయాలని తల్లిని బెదిరించాడు. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూస్మార్ట్ కి చెందిన ఆ క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్ లోని ఐరియా మాల్ నుంచి సెక్టార్ 86లోని తన ఇంటికి శుక్రవారం రాత్రి ఆ మహిళ తన కుమారుడితో కలిసి బ్లూస్మార్ట్ క్యాబ్ లో వెళ్లింది.

తుపాకీతో బెదిరించి..

క్యాబ్ సెక్టార్ 83 సమీపంలోకి రాగానే క్యాబ్ ను నిలిపేసిన ఆ డ్రైవర్.. కార్లోని మహిళను, ఆమె కుమారుడిని తుపాకీతో బెదిరించి, డబ్బు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అవేమీ తన దగ్గర లేవని ఆ మహిళ చెప్పడంతో, యూపీఐ ద్వారా ఆమె అకౌంట్లోని రూ.55 వేలు తన ఖాతాకు బదిలీ చేశాడు. ఆమె బ్యాగును కూడా దోచుకుని, వారిని తన కారులో నుంచి దింపేశాడు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసులకు ఫిర్యాదు

ఈఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్ మొబైల్ నంబర్ ఆధారంగా అతడిని ట్రేస్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ సోనూ సింగ్ గురుగ్రామ్ లో అద్దెకు ఉంటున్నాడు. నిందితుడిని విచారించిన తర్వాత డబ్బు రికవరీ చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బ్లూ స్మార్ట్ స్పందన

ఈ ఘటనపై క్యాబ్ అగ్రిగేటర్ బ్లూ స్మార్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమమని తెలిపింది. అన్ని విధాలుగా పరీక్షించిన తరువాతనే డ్రైవర్లను విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించింది. ‘‘డ్రైవర్ ఐడెంటిటీలను ధృవీకరించడానికి మా టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫేషియల్ రికగ్నిషన్, రైడర్ల కోసం ప్రత్యేక భద్రతా హెల్ప్ లైన్ ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం దురదృష్టకరం’’ అని పేర్కొంది. సేఫ్టీ ప్రోటోకాల్స్ ను మరింత బలోపేతం చేసే దిశగా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతూ, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. బ్లూస్మార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అన్మోల్ సింగ్ జగ్గీ మాట్లాడుతూ, ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, భద్రత అనేది బ్లూస్మార్ట్ పునాది అని ఆయన అన్నారు.

Whats_app_banner