Jagtial : జగిత్యాలలో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో నగలు, డబ్బు అపహరణ-jewelry and money were stolen from a locked house in jagtial ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial : జగిత్యాలలో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో నగలు, డబ్బు అపహరణ

Jagtial : జగిత్యాలలో భారీ చోరీ.. తాళం వేసిన ఇంట్లో నగలు, డబ్బు అపహరణ

HT Telugu Desk HT Telugu
Oct 11, 2024 10:02 AM IST

Jagtial : పండగ పూట ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. జగిత్యాలలో ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు.. సుమారు 6 లక్షల రూపాయల విలువచేసే నగలు, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు.

జగిత్యాలలో భారీ చోరీ
జగిత్యాలలో భారీ చోరీ

జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో భారీ చోరి జరిగింది. ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేసే తోట ప్రసాద్.. తన ఇంటికి తాళం వేసి పండగకు స్వస్థలం కరీంనగర్ వెళ్లారు. తాళం వేసిన ఆయన ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. రెండు బీరువాల తాళాలు పగులగొట్టి సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసి బంగారు ఆభరణాలను, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. బీరువాలో ఉన్న దుస్తులు, ఇంట్లో సామాగ్రిని చిందర వందరగా పడేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఇళ్లు గుల్ల..

సద్దుల బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా తోట ప్రసాద్ భార్యా పిల్లలతో కలిసి బుధవారం కరీంనగర్‌కు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ప్రసాద్ ఇంట్లో చొరబడ్డారు. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్.. కష్టపడి సంపాదించుకున్న సొమ్ములు దొంగలపాలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

ఊరెళ్తే సమాచారం ఇవ్వండి..

భారీ చోరీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పండగ వేళ నిఘాను పెంచారు. పండగకు ఊరెళ్తే.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాళం వేసి ఊరెళ్తే.. ఇంటి పక్కవారికి, సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచార ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా సమాచారం ఇస్తే.. పోలీసులు ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేసి.. చోరీలకు అవకాశం లేకుండా చూస్తామని జగిత్యాల పోలీసులు చెబుతున్నారు.

పండగ పూట విషాదం..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పండగ పూట విషాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేసే సుబ్బారావుగా గుర్తించారు. టిఫిన్ కోసమని బైక్‌పై రోడ్డు మీదకు రాగా.. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హొంగార్డు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పండగ పూట హోంగార్డు మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner