Ramleela Ravan Dahan: దసరా రోజు రామ్‌లీలాలో రావణ దహనం చేయబోయేది ఈ సింగం స్టార్లే
Ramleela Ravan Dahan: దసరా సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం జరుగుతుందన్న విషయం తెలుసు కదా. ఈసారి సింగం అగైన్ మూవీ స్టార్లు ఈ రావణ దహనం చేయబోతున్నారు.
Ramleela Ravan Dahan: ఢిల్లీలోని రామ్ లీలా మైదానానికి ఈ దసరా నాడు మరోసారి బాలీవుడ్ సెలబ్రిటీల తాకిడి ఉండనుంది. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే రావణ దహనాన్ని ఈసారి సింగం అగైన్ స్టార్లు అయిన అజయ్ దేవగన్, కరీనా కపూర్, డైరెక్టర్ రోహిత్ శెట్టి చేయబోతున్నారు. దేశంలో చాలా చోట్ల రావణ దహనాలు జరిగినా.. రామ్ లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఉంటుంది.
రామ్‌లీలాకు సింగం అగైన్ స్టార్లు
దసరా రోజు ఢిల్లీలోని లవ కుశ రామ్ లీలా మైదానంలో జరగబోయే రావణ దహనాన్ని ఈసారి బాలీవుడ్ సెలబ్రిటీలు చేయనున్నారు. ఈ విషయాన్ని లవ కుశ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ వెల్లడించారు. సింగం అగైన్ మూవీ టీమ కు ఆహ్వానం పంపినట్లు ఆయన చెప్పారు. భారతీయ సంస్కృతిని ప్రమోట్ చేయడంలో భాగంగా తాము ఈ ఆహ్వానం పంపినట్లు తెలిపారు.
శనివారం (అక్టోబర్ 12) దసరా ఉత్సవాల్లో భాగంగా రామ్ లీలా మైదానంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, సింగం అగైన్ మూవీ డైరెక్టర్ రోహిత్ శెట్టి రావణ దహనం చేయనున్నట్లు అర్జున్ కుమార్ చెప్పారు. 50 ఏళ్లుగా ఈ మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.
"చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా ఈసారి లవ కుశ రామ్ లీలా కమిటీ సింగం అగైన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, స్టార్లు అజయ్ దేవగన్, కరీనా కపూర్ లను ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని వాళ్లు స్వీకరించారు. అక్టోబర్ 12న రావణ దహనం చేయనున్నారు" అని అర్జున్ కుమార్ చెప్పారు. 2016లో ఓసారి అజయ్ దేవగన్ ఈ రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నాడు.
సింగం అగైన్ మూవీ గురించి..
సింగం అగైన్ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ మధ్యే మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏకంగా 4 నిమిషాల 58 సెకన్ల నిడివితో అత్యంత సుదీర్ఘమైన బాలీవుడ్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ తోపాటు రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకోన్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.
2011లో వచ్చిన సింగం, 2014లో వచ్చిన సింగం రిటర్న్స్ సినిమాల తర్వాత ఇప్పుడీ సింగం అగైన్ వస్తోంది. రామాయణంతో లింకు పెట్టి సాగిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతను కాపాడేందుకు రాముడు తన సేనతో కలిసి లంకపై దండెత్తినట్లు.. ఈ మూవీలో కరీనాను కాపాడుకునేందుకు అజయ్ తన పోలీసు సైన్యంతో విలన్ అర్జున్ కపూర్ పై దాడి చేసినట్లుగా ట్రైలర్ లో చూపించారు.