Dibrugarh Express accident: ఉత్తరప్రదేశ్ లో పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్
ఉత్తరప్రదేశ్ లోని గోండాలో గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ (15904)కు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఈ రైలు చండీగఢ్ నుంచి వస్తుండగా ఉత్తరప్రదేశ్ జిలాహి రైల్వే స్టేషన్, గోసాయి దివా మధ్య ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని గోండాలో గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ (15904)కు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. ఈ రైలు చండీగఢ్ నుంచి వస్తుండగా ఉత్తరప్రదేశ్ జిలాహి రైల్వే స్టేషన్, గోసాయి దివా మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
యోగి ఆదిత్యానాథ్ స్పందన
‘‘గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది.
సహాయక చర్యలు ముమ్మరం
రైల్వేకు చెందిన మెడికల్ వ్యాన్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ లోని గోండాలో దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ (15904) పట్టాలు తప్పిన నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసింది. అవి టిన్సుకియా (9957555984), ఫుర్కటింగ్ (995755596), మరియాని (6001882410), సిమల్గురి (8789543798), తిన్సుకియా (9957555959), దిబ్రూగఢ్ (9957555960). మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఈశాన్య రైల్వే సీపీఆర్వో పంకజ్ సింగ్ తెలిపారు.
అస్సాం సీఎం స్పందన
రైలు ప్రమాదంలో తమ రాష్ట్రం వారెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నామని అస్సాం ప్రభుత్వం తెలిపింది. సంబంధిత అధికారులతో అస్సాం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. జూన్ 17న పశ్చిమబెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో సీల్దా వెళ్లే కంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు.