Flood in Northeast states : ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. అస్సాంలో 56 మంది మృతి
Flood in Northeast states : ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనితో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పటికే 56 మందికిపైగా అస్సాంలో మృతి చెందారు.
ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు భయపెడుతున్నాయి. అస్సాంలో మరో ఎనిమిది మంది మరణించడంతో ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 56కి పెరిగింది. మణిపూర్‌లో, సేనాపతి జిల్లాలోని సేనాపతి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా నాగాలాండ్‌లో వర్షాలకు సంబంధించిన సంఘటనలు కనీసం ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి, చాలా నష్టాన్ని కలిగించాయి.
అస్సాంలో భారీగా వరదలు
అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. చాలా మంది మరణించారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం, సోనిత్‌పూర్ జిల్లాలోని తేజ్‌పూర్ రెవెన్యూ సర్కిల్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మోరిగావ్‌లోని మయోంగ్, దిబ్రూగర్‌లోని నహర్‌కటియా, దర్రాంగ్‌లోని పబ్ మంగళాడి, గోలాఘాట్‌లోని డెర్గావ్, బిస్వనాథ్‌కు చెందిన హలేమ్, టిన్సుకియాకు చెందిన మార్గరీటాలో ఒక్కొక్కరు మునిగిపోయారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 56కి చేరింది. సోనిత్‌పూర్, శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని, వరద నీటిలో కొట్టుకుపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
నివేదికల ప్రకారం, బార్‌పేట, బిస్వనాథ్, కాచర్, చరైడియో, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూఘర్, గోల్‌పరా, గోలాఘాట్, హైలాకండి, హోజై, జోర్హాట్, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలి జిల్లాల్లో ప్రజలు వరదల బారిన పడ్డారు. ఈస్ట్ కర్బీ అంగ్లాంగ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, కరీంగంజ్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బారి, శివసాగర్, సోనిత్‌పూర్, టిన్సుకియాలోనూ వరద ప్రభావితం ఎక్కువగానే ఉంది..
వరదలతో ధుబ్రీ అత్యంత ప్రభావితమైంది. 2,23,000 మందికి పైగా ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 184,000 మందితో దర్రాంగ్, 166,000 కంటే ఎక్కువ మంది ప్రజలు వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం అస్సాం వ్యాప్తంగా 2,800 గ్రామాలు నీటమునిగి ఉండగా 42,476.18 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది నిమతిఘాట్, తేజ్‌పూర్, గౌహతి, గోల్‌పరా, ధుబ్రీ వద్ద ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది.
మణిపూర్‌లో
మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో రెండు ప్రధాన నదుల గట్టు తెగిపోయిన తర్వాత అనేక చోట్ల వరదలకు దారితీసింది. బుధవారం నాడు 2,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. సేనాపతి జిల్లాలోని సేనాపతి నదిలో కనీసం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించగా, వరద పరిస్థితి దృష్ట్యా గురువారం వరకు పాఠశాలలు మూసివేసే ఉన్నాయి.
ఇంఫాల్ తూర్పు జిల్లాలో 1,300 మంది, ఇంఫాల్ వెస్ట్‌లో దాదాపు 700 మందిని ప్రభావిత ప్రాంతాల నుండి తరలించినట్లు జలవనరులు, సహాయ అండ్ విపత్తు నిర్వహణ మంత్రి అవాంగ్‌బో న్యూమై తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు, మణిపూర్ ఫైర్ సర్వీస్‌తో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నాగాలాండ్ లో
గత కొన్ని రోజులుగా నాగాలాండ్‌లో వర్షాలకు సంబంధించిన సంఘటనలు కనీసం ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి. విస్తృతమైన నష్టాన్ని కలిగించాయి. టుయెన్సాంగ్ జిల్లాలోని కేజోక్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు జూన్ 28న అయోంగ్ నుల్లా వద్ద గల్లంతయ్యారు. అదే రోజు బాలురలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా, మరొకరి కోసం అన్వేషణ అతని తండ్రి సమ్మతితో ఆపేశారు. బాలుడు మాత్రం దొరకలేదు. ఇలా ఈశాన్య రాష్ట్రాలో వరదలతో అల్లకల్లోలం అవుతున్నాయి.