Bus accident: ఘోర రోడ్డు ప్రమాదం; 11 మంది దుర్మరణం; డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
Maharashtra Bus accident: బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలోని గోండియాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారు.
Maharashtra Bus accident: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సులో సుమారు 45 మందికి పైగా ఉన్నారు. వారిలో 34 మంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారు. గాయపడినవారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో నాగ్ పూర్ కు, చంద్రపూర్ కు, భండారాకు, గోండియాకు చెందినవారు ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం
మహారాష్ట్ర (maharashtra news) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెందిన ఆ బస్సు నాగపూర్ నుంచి గోండియాకు వెళ్తోంది. వేగంగా వెళ్తున్న ఆ బస్సు గోండియా జిల్లా బింద్రావణ తోలా గ్రామం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో, బస్సులోని వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో 11 మంది చనిపోయారు. క్షతగాత్రులను గోండియా జిల్లా ఆసుపత్రికి తరలించామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
తక్షణ సాయంగా రూ.10 లక్షలు
ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందించారు. బాధితులకు తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, ఘటనా స్థలం నుంచి ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
మృతుల కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివ్ షాహి బస్సు ప్రమాదానికి గురికావడం చాలా దురదృష్టకరమని, ఇందులో కొందరు ప్రయాణికులు మరణించారని ఫడ్నవీస్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ‘‘మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాల బాధలో మేము కూడా పాలు పంచుకుంటాం. క్షతగాత్రులకు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశాం’’ అని ఫడ్నవీస్ తెలిపారు.
ప్రైవేటు హాస్పిటల్స్ లో..
ఈ ఘటనలో గాయపడిన వారు అవసరమైతే వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ‘‘అవసరమైతే వారిని నాగ్ పూర్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని గోండియా కలెక్టర్ కు చెప్పాను. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.