AP CID Chief: నిధుల దుర్వినియోగంపై ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు, విజయవాడ వదిలి వెళ్లరాదని ఆంక్షలు
AP CID Chief: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు అధికార దుర్వినియోగం అభియోగాలపై సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP CID Chief: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసంది. సంజయ్ విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో సంజయ్‌పై వేటు పడింది. నిధులు, అధికార దుర్వినియోగం చేశారని సంజయ్‌పై అభియోగాలు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సంజయ్ పదవిలో ఉండగా టెండర్లు లేకుండా ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు కొనుగోలు చేశారని, అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణ పూర్తయ్యే వరకు విజయవాడ వదిలి వెళ్లవద్దని సంజయ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అఖిలభారత సర్వీసుల నియమావళిలోని 3 (1) సెక్షన్ ప్రకారం ఈ సస్పెన్షన్ విధించింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరణ్కుమార్ ప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
సీఐడీ అదనపు డీజీగా, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో డీజీగా సంజయ్ పనిచేశారు. విధుల్లో ఉండగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, రూల్ 1969లోని నిబంధన3(1) కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.
అగ్నిమాపక శాఖలో డీజీగా ఉండగా టెండర్ల ప్రక్రియలో అక్రమాలతో పాటు నిబంధనల అమలులో అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అగ్ని పోర్టల్లో ఎన్వోసీలను జారీ చేయడం, హార్డ్ వేర్ సరఫరా కోసం రూ.2.29కోట్ల ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు.
2023 ఫిబ్రవరి 23న చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.59.93లక్షలు చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్ 2023నాటికి కేవలం 14శాతం మాత్రమే ప్రాజెక్టు పూర్తి అయినట్లు విజిలెన్స్ విచార ణలో తేలింది. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మైక్రోసాఫ్ట్ లాప్‌టాప్‌లు, యాపిల్ ఐ ప్యాడ్లను టెండర్ ప్రక్రియ లేకుండా డీజీ హోదాలో సంజయ్ కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో రూ.17.89లక్షలు అధిక చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు.
సదస్సుల పేరుతో స్వాహా..
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో బిల్లులు తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించి వాటికి కోట్లలో బిల్లులు సమర్పించారు. ఈ కార్యక్రమాలను కృతి వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీ ద్వారా నిర్వహించారు. సదస్సుల నిర్వహణకు రూ.3.10లక్షల ఖర్చైతే కోటి 15లక్షల అదనపు బిల్లులు చెల్లించారు. అడ్రస్ లేని కంపెనీకి టెండర్లను కట్టబెట్టారు. అతి తక్కువ సమయంలో జరిగిన అనుమానాస్పద వ్యవహారంపై విచారణ జరుగుతోంది. అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాధనం స్వాహా, నిబంధనల అతి క్రమణలపై చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అను మతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశించారు.