Polavaram Dues: పోలవరం భూసేకరణ, పునరావాసం బకాయిలు విడుదల, డిసెంబర్‌ రెండో వారంలో చంద్రబాబు పర్యటన-polavaram land acquisition rehabilitation dues released chandrababu naidu to visit in second week of december ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Dues: పోలవరం భూసేకరణ, పునరావాసం బకాయిలు విడుదల, డిసెంబర్‌ రెండో వారంలో చంద్రబాబు పర్యటన

Polavaram Dues: పోలవరం భూసేకరణ, పునరావాసం బకాయిలు విడుదల, డిసెంబర్‌ రెండో వారంలో చంద్రబాబు పర్యటన

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 04, 2024 07:02 AM IST

Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది. 2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Polavaram Dues: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా, 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి నిమ్మల తెలిపారు. డిసెంబర్ రెండోవారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అదేరోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక రోజు గానీ, ఒక గంట గానీ వృథా కాకూడదని సీఎం చెప్పారని మంత్రి వివరించారు. 10 రోజుల్లో మరింత క్లారిటీ తీసుకుని షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుందన్నారు.

పోలవరం ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించిన రూ.996 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి వివరించారు. పోలవరం విషయంలో అంతర్రాష్ట్ర సమస్యలకు సంబంధించి చత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని కచ్చితంగా పోలవరం ఫలాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కూడా అందిస్తామన్నారు.

హంద్రీ-నీవా:

రాయలసీమకు లైఫ్ లైన్ వంటి హంద్రీ-నీవా ప్రాజెక్టును గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 కూడా కేటాయించలేదని ఆరోపించారు. హంద్రీ-నీవాను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ నెలలో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. హంద్రీ-నీవా ప్రధాన కాల్వ విస్తరణ, లైనింగ్ పనులు మొదలుపెడతామన్నారు. డిసెంబర్-జనవరి నెలల్లో హంద్రీ-నీవా పనులు ప్రారంభిస్తారు.

చింతలపూడి:

4 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే బహుళార్థక ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ కు రూ.73 కోట్ల పెనాల్టీ విధించారని గుర్తు చేశారు. 3 నెలల్లో అనుమతులు తీసుకోవాలని చెప్పినా, పట్టించుకోకపోవడంతో 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో చింతలపూడి ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేశారన్నారు.

వెలిగొండ:

ప్రాజెక్టుల విషయంలో గత ఐదేళ్లు పాలకులు మొద్దు నిద్రపోయారని, అవాస్తవాలు-అసత్యాలు వెల్లడించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితిని సమీక్షించారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. 2024 ఎన్నికల సమయంలో రైతులను కూడా దగ్గరకు రానీయకుండా ప్రాజెక్టును అంకితం చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేశారన్నారు. 2026 జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

వాటర్ పాలసీ:

తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా వాటర్ పాలసీ తీసుకురావడం జరుగుతోందన్నారు. ఇటీవల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు 11 వేల టీఎంసీలు నీళ్లు రాష్ట్రానికి వచ్చినా వాటిలో 954 టీఎంసీలు మాత్రమే వాడుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలన్నా లక్ష్యంతో.. వరదలొచ్చినా, కరువు కాటకాలొచ్చినా రాష్ట్రాన్ని కాపాడాలన్న ముందుచూపుతో వాటర్ పాలసీ తీసుకురావడం జరుగుతోందన్నారు.

నదుల అనుసంధానం:

ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా .. సవాళ్లెన్ని ఎదురైనా గోదావరి - కృష్ణా - పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని గోదావరి - కృష్ణా - బనకచర్ల ప్రాజెక్టు ఇదొక గేమ్ ఛేంజర్ అని స్పష్టం చేశారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించి ప్రతి ఎకరాకూ సాగునీరందించాలంటే నదుల అనుసంధానం జరగాల్సిందేనన్నారు. రాష్ట్రం రూపు రేఖలు మార్చే నదుల అనుసంధానాన్ని 2-3 ఏజెన్సీలతో తక్కువ ఖర్చుతో చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Whats_app_banner