Skipping: స్కిప్పింగ్ అంటే పిల్లల ఆటే అనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Skipping: స్కిప్పింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఇది ఓ ఆట అనే భావనతో చాలా మంది వర్కౌట్లలో ఇది చేయరు. అయితే, స్కిప్పింగ్ చాలా ఎఫెక్టివ్ ఎక్సర్‌సైజ్. దీనివల్ల కలిగే లాభాలు ఇక్కడ చూడండి.
స్కిప్పింగ్ అంటే చిన్న పిల్లలు ఆడే ఆట మాత్రమే అని ఇప్పటికీ కొందరు అనుకుంటూ ఉంటారు. అందుకే వ్యాయామాల్లో కొందరు తాడాటను తేలిగ్గా తీసుకుంటారు. అయితే, స్కిప్పింగ్ చాలా ప్రభావవంతమైన వ్యాయామం. దీనివల్ల పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తాడు తగలకుండా ఎగురుతూ చేసే ఈ స్కిప్పింగ్‍లో చాలా అవయావాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇదో ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో ఇక్కడ చూడండి.
బరువు తగ్గేందుకు భేష్
స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగ్గా అవుతుంది. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో బరువు తగ్గేందుకు ఈ స్కిప్పింగ్ చాలా ఉపయోగపడుతుంది. స్కిప్పింగ్‍లో కాళ్లు, చేతులు, నడుము, భుజాలతో పాటు శరీరంలోని చాలా కండరాలు ఇన్వాల్వ్ అవుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు స్కిప్పింగ్ ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారి వారు వర్కౌట్లలో స్కిప్పింగ్‍ను తప్పకుండా చేర్చుకోవాలి.
గుండెకు చాలా మంచిది
స్కిప్పింగ్‍లో గెంతడం ప్రధానంగా ఉంటుంది. తాడు తగలకుండా ఓ లయ ప్రకారం వేగంగా ఎగరాల్సి ఉంటుంది. ఇలా జంప్ చేస్తుండటంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో గుండెకు ఆక్సిజన్ మెరుగ్గా అందుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరగుతుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె కండరాలకు పోషకాల సరఫరా బాగా అవుతుంది. స్కిప్పింగ్ డైలీ చేయడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.
స్టామినా పెరుగుతుంది
స్కిప్పింగ్ వల్ల బాడీ స్టామినా బాగా పెరుగుతుంది. అవయవాల పనితీరు అధికం అవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా అవుతుంది. దీంతో శరీరం చాలా చురుగ్గా మారుతుంది.
కండరాల దృఢత్వం
స్కిప్పింగ్ చేయడం కండరాలకు చాలా మేలు చేస్తుంది. స్కిప్పింగ్ రెగ్యులర్‌గా చేస్తే కాళ్లు, తొడలు, చేతులతో పాటు చాలా భాగాల్లో కండరాల దృఢత్వం పెరుగుతుంది. కండరాల శక్తి అధికం అవుతుంది.
ఎముకల కోసం..
స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకల బలానికి చాలా తోడ్పడుతుంది. జంపింగ్ చేయడం కటి ఎముకల సాంద్రత మెరుగవుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ విషయం ఉపయోగకరంగా ఉంటుంది. ఎముకల దృఢత్వం పెరిగేందుకు స్కిప్పింగ్ ఎంతో సహకరిస్తుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం
స్కిప్పింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్కిప్పింగ్ చేసే సమయంలో పూర్తి శ్రద్ధ తాడు తగలకుండా ఎగరడంపై ఉంటుంది. ఏకాగ్రత అంతా దానిపైనే పెడతారు. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గేందుకు ఇది ఉపకరిస్తుంది. జ్ఞాపకశక్తి పెరిగేందుకు కూడా స్కిప్పింగ్ తోడ్పడుతుంది.
సంబంధిత కథనం