Amaravati Plots Registration: అమరావతి రైతులకు అలర్ట్, రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు కొత్తగా 9 కేంద్రాలు ఏర్పాటు
Amaravati Plots Registration : సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రాజధాని పరిధిలోని 9 ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించినట్లు సీఆర్డీఏ ప్రకటించింది.
అమరావతికి భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాజధాని ప్రాంత రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం చేసింది. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల(గృహ, వాణజ్య) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం 9 ప్రాంతాలలో కేంద్రాలను ప్రారంభించినట్లు ఏపీ సీఆర్డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్, 2024 నుంచి ఇప్పటి వరకు 2,704 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయినట్లు సీఆర్డీఏ ప్రకటించింది.
కొత్తగా అందుబాటులో 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు
1) నవులూరు
2) కురగల్లు
3) నిడమర్రు
4) పెనుమాక
5) ఉండవల్లి
6) రాయపూడి
7) ఉద్దండరాయుని పాలెం
8) వెలగపూడి
9) వెంకటపాలెం
అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను పంపిణీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో ఇటీవల ఈ-లాటరీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఎ అదనపు కమిషనర్ ఎం.నవీన్ మాట్లాడుతూ... అమరావతి అభివృద్ధికి రైతుల సహకారం అభినందనీయమన్నారు. రాజధాని ప్రాంతంలో అదనంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లాటరీ విధానంలో ప్లాట్లు పొందిన రైతులు వారంలోగా తమ ప్లాట్‌లను నమోదు చేసుకోవచ్చన్నారు. సీఆర్‌డీఏ అధికారులు ఇటీవల 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్లను రైతులకు కేటాయించారు.
అమరావతిలో రూ.11,467 కోట్ల అభివృద్ధి పనులు
అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. డిసెంబర్ 2, 2024న సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అథారిటీ మొత్తం 23 అంశాలను ఆమోదించింది. ఈ అంశాలన్నింటిపై ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ పనులకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతి తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మొత్తం 23 అంశాల అజెండాతో జరిగిన ఈ సమావేశంలో రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ అనుమతించిందన్నారు. ఇక అమరావతిలో గెజిటెట్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు భవనాల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 15లోపు ఐదు ఐకానిక్ టవర్లకు డిజైన్లు అందిస్తారని, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు.