CM Revanth Reddy : హైదరాబాద్ మన ఆదాయం, ఆత్మగౌరవం-న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy says develops hyderabad like new york tokyo need one lakh crores for development ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : హైదరాబాద్ మన ఆదాయం, ఆత్మగౌరవం-న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైదరాబాద్ మన ఆదాయం, ఆత్మగౌరవం-న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2024 09:44 PM IST

CM Revanth Reddy : న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, ఆత్మగౌరవం అన్నారు. నగరంలో రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయల కల్పనకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

హైదరాబాద్ మన ఆదాయం, ఆత్మగౌరవం-న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మన ఆదాయం, ఆత్మగౌరవం-న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ప్రణాళికలు : సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో ముఖ్య నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్నాయని, ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ మైదానంలో రూ. 7 వేల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించామన్నారు. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చిందని, అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నామన్నారు. భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి, అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుందన్నారు. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నిలబడుతుందన్నారు.

రూ.35 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్

"మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం"- సీఎం రేవంత్ రెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో కూరగాయలు, ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయన్నారు. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామని తెలిపారు. ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించామన్నారు.

29 శాతం పెరిగిన రియల్ ఎస్టేట్

1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగిందన్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయక తప్పదన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలన్నారు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, ఆత్మగౌరవం అన్నారు. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని, ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం