Warangal : బీఆర్ఎస్ గురుకుల బాటలో తీవ్ర ఉద్రిక్తత.. 50 మంది వరకు అరెస్టు-intense tension in the gurukula bata organized by brs in warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : బీఆర్ఎస్ గురుకుల బాటలో తీవ్ర ఉద్రిక్తత.. 50 మంది వరకు అరెస్టు

Warangal : బీఆర్ఎస్ గురుకుల బాటలో తీవ్ర ఉద్రిక్తత.. 50 మంది వరకు అరెస్టు

HT Telugu Desk HT Telugu
Dec 03, 2024 05:26 PM IST

Warangal : వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు.. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం వరంగల్ జిల్లాలో చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.

రాకేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
రాకేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆయన అనుచరులు దాదాపు 50 మంది హనుమకొండ జిల్లా పరిధి మడికొండలోని గురుకులానికి వెళ్లారు. హాస్టల్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మడికొండ సీఐ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు.

దీంతో గులాబీ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడించింది. అప్పటికే పోలీసులు బలగాలు అక్కడ మోహరించడం, బీఆర్ఎస్ నేతలకు, వారికి మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయి దాటే అవకాశం ఉంటడంతో రాకేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 50 మంది కార్యకర్తలను మడికొండ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంట పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోరాటం ఆగదు..

గురుకులాలు బాగయ్యేంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటామని.. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. మడికొండ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు ‘గురుకుల బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు.

విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదన్నారు. అరకొర వసతులతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు సహాయం చేయడానికే వచ్చామని, అంతే తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా పాఠశాలల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఎన్నడూ ఇంత నిర్బంధం చూడలేదన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా గడిచిన పది నెలల కాలంలోనే మొత్తంగా 49 మంది విద్యార్థులు మరణించారని.. రాకేష్ రెడ్డి ఆరోపించారు. సుమారు 1500 మంది విద్యార్థులు తీవ్ర ఆస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారన్నారు. గురుకుల పాఠశాల పిల్లలు హాస్టల్‌లో కంటే హాస్పిటల్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో అంతా బాగానే ఉంటే బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

అసలు లోపలికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక ఉపాధ్యాయులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేటు దగ్గర కాపలాకు పెడుతోందని విమర్శించారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా గురుకులాల్లో సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner