Gurukula School Student : కొత్లాపూర్ బీసీ గురుకుల పాఠశాలలో విషాదం, ఉరి వేసుకొని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Gurukula School Student : సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం ఉదయం స్థానికంగా కలకలం సృష్టించింది. తమ కూతురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ విద్యార్థి తల్లితండ్రులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన రాజు కుమార్తె స్వాతి (14) సంగారెడ్డి మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. కాగా స్వాతికి ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ శనివారం ఉదయం హాస్టల్ గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గమనించిన తోటి విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే స్వాతిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాఠశాలకు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కూతురి మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థి స్వాతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
తమ కూతురు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని పాఠశాలకు పంపిస్తే, ఇలా అకాల మరణంతో తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లితండ్రులు భోరున విలపిస్తున్నారు. కూతురి మృతి విషయం తెలుసుకున్న వెంటనే స్వాతి తల్లితండ్రులు, బంధువులు కొత్లపూర్ గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్నారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని చంపేశారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సూరారం గ్రామానికి చెందిన గజం కిషన్ (60) ద్విచక్ర వాహనంపై సూరారం నుండి చిన్నశంకరంపేట వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో సూరారం వైపు చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన రమేష్ బైక్ ఫై వస్తున్నారు. కాగా మార్గమధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం గమనించిన స్థానికులు ఇద్దరిని చికిత్స నిమిత్తం అంబులెన్సు లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కిషన్ ను మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కిషన్ మృతి చెందాడు.
సంబంధిత కథనం