Warangal Eiffel Tower: ఓరుగల్లులో ఈఫిల్ టవర్.. ఫారిన్ అందాలతో వరంగల్ ట్రై సిటీకి కొత్త కళ
Warangal Eiffel Tower: చారిత్రక కట్టడాలకు నిలయమైన ఓరుగల్లులో ఫారెన్ అందాలు కనువిందు చేస్తున్నాయి. వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్ లాంటి హిస్టారికల్ ప్లేసులున్న సిటీలో విదేశాల్లో పేరుగాంచిన టూరిస్ట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తున్నారు.
Warangal Eiffel Tower: వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడంలో భాగంగా నగరానికి అదనపు ఆకర్షణను అందించేందుకు టూరిస్టులను ఆకట్టుకునేలా జంక్షన్లను తీర్చి దిద్దుతున్నారు. పారిస్ లో ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన ఈఫిల్ టవర్ ను హనుమకొండ బాలసముద్రంలో ఏర్పాటు చేయగా.. ఇప్పుడది సిటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో సిటీ అందాలను చూసేందుకు వచ్చే జనాలు పనిలో పనిగా దీనిని చూసేందుకు తరలి వస్తున్నారు. వివిధ శుభకార్యాలకు నిర్వహించే ఫొటో షూట్ లలో ఈఫిల్ టవర్ భాగం చేసుకుంటున్నారు.
కొద్దిరోజుల కిందటే ఈఫిల్ టవర్ ను ఇక్కడ ఏర్పాటు చేయగా.. సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దానిని అధికారికంగా ప్రారంభించారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. కేవలం ఈఫిల్ టవర్ మాత్రమే కాకుండా నగరంలోని మరికొన్ని జంక్షన్లను కూడా ఫౌంటేన్లు, వివిధ ఆకారాలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.
వరంగల్ సిటీకి స్పెషల్ అట్రాక్షన్
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వరంగల్ ట్రై సిటీకి కొత్త అందాలను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ బాలసముద్రంలో 30 అడుగుల ఈఫిల్ టవర్ ను ఏర్పాటు చేశారు. నిజమైన ఈఫిల్ టవర్ పారిస్ నగరంలో ఉండగా.. అచ్చం దాని లాగానే వరంగల్ లో దాదాపు రూ.23.5 లక్షల వ్యయంతో మినీ ఈఫిల్ టవర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో బాలసముద్రం ఏరియాకు కొత్త కళ వచ్చినట్టయ్యింది.
కాగా పర్యాటకులను ఆకర్షించే ఈఫిల్ టవర్ పారిస్ ఉండగా.. వరంగల్ లో ఏర్పాటు చేసిన టవర్ తెలంగాణలోనే మొదటిదని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కాజీపేట చౌరస్తాను కూడా రూ.28 లక్షలతో ఆకర్షణీయంగా డెవలప్ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు, టూరిస్టులు రాకపోకలు సాగిస్తుండగా.. దానికి సంబంధించిన స్టాట్యూ పెట్టారు.
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో దాదాపు రూ.20 లక్షలతో శంఖం, వాటర్ ఫౌంటేన్, హనుమకొండ బాలాజీ నగర్ జంక్షన్ లో రూ.67 లక్షలతో పెట్టిన వాటర్ ఫౌంటేన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కాగా స్మార్ట్ సిటీగా డెవలప్ మెంట్ లో భాగంగా నగరంలోని 13 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా అధికారులు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే ములుగు రోడ్డు, హంటర్ రోడ్డు, అంబేద్కర్ జంక్షన్, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ ల వద్ద ఇప్పటికే వివిధ కళాకృతులు ఏర్పాటు చేయగా.. వరంగల్ నగరానికి వచ్చే టూరిస్టులను అవి ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
సిటీని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తామని ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మొత్తం వంద కోట్లతో భద్రకాళి బండ్, రూ.26 కోట్లతో వడ్డేపల్లి బండ్ ను అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే స్మార్ట్ సిటీలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనులు పూర్తయితే నగరానికి కొత్త కళ వచ్చే అవకాశం ఉంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)