AP TG Earth Quake:: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం-earth tremors in telugu states people running from their homes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Earth Quake:: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం

AP TG Earth Quake:: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 04, 2024 11:13 AM IST

AP TG Earth Quake:: తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు వణికించాయి. ఉదయం 7 గంటల నుంచి 7.28 మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ములుగు జిల్లాలో మేడారం, మారేడుపాక, బోర్ల గూడెం మధ్య ఉన్న ప్రాంతంలో భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ నమోదు చేసింది.

ములుగు కేంద్రంగా భూకంపం
ములుగు కేంద్రంగా భూకంపం

AP TG Earth Quake:: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను భూ ప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.28వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ములుగు జిల్లాలో మేడారం, మారేడుపాక, బోర్ల గూడెం మధ్య ఉన్న ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమిలోపల 40 కి.మీ లోతున భూ కంపం వచ్చినట్టు గుర్తించారు.

చర్ల, దుమ్ముగూడెం ప్రాంతంలో ప్రకంపనలు అధికంగా కనిపించాయి. ఇళ్లంతా కదిలిపోతున్నట్టు అనిపిండచంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు స్థానికులు తెలిపారు. కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, ఇళ్లలో సామాన్లు పడిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చిన వార్తలు వెలువడ్డాయి. ఖమ్మం-ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అధికంగా కనిపించాయి. ఖమ్మం జిల్లా చర్ల, మణుగూరు ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ఉదయం ఇళ్లలో ఉన్న ఉన్నవారు వీటిని గుర్తించగలిగినట్టు తెలుస్తోంది.

బుధవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలో జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు భూకంపాలు సంభవించే జోన్‌లో ఉన్నాయి. నదీ తీర ప్రాంతాలు, బొగ్గు గనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుంటాయి. భూమి పొరల్లో జరిగే సర్దుబాట్ల వల్ల కూడా అప్పుడప్పుడు ప్రకంపనలు నమోదవుతుంటాయి. బుధవారం సాధారణం కంటే ఎక్కువగా ఈ ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో..

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. విజయవాడలో కూడా కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు.

భద్రాద్రి కొత్తగూడెంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి.

మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున ప్రజలు సైతం కిందపడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్‌ విద్యానగర్‌లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది.

పెద్దపల్లి జిల్లాలో…

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. హనుమకొండ హంటర్ రోడ్ లోని దీన్‌ దయాల్ నగర్, విద్యుత్ నగర్ లోని స్థానిక ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీసారు. వంట గదిలోని గిన్నెలు కింద పడ్డాయి.

Whats_app_banner