Chandrababu Residence: వెలగపూడిలో చంద్రబాబు సొంతిల్లు, ఐదు ఎకరాల హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం-chandrababu naidu buys land in andhra pradeshs velagapudi of amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Residence: వెలగపూడిలో చంద్రబాబు సొంతిల్లు, ఐదు ఎకరాల హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం

Chandrababu Residence: వెలగపూడిలో చంద్రబాబు సొంతిల్లు, ఐదు ఎకరాల హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 04, 2024 11:06 AM IST

Chandrababu Residence: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాస చిరునామా త్వరలో మారనుంది. పదేళ్లుగా విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోర్‌ క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుత వెలగపూడి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు.

సొంత ఇంటి కోసం వెలగపూడిలో హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు
సొంత ఇంటి కోసం వెలగపూడిలో హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Residence: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోనున్నారు. దాదాపు పదేళ్లుగా ఉండవల్లి గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. లింగమనేని రమేష్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌ను లీజుకు తీసుకుని అందులో నివాసం ఉంటున్నారు. 2015 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ఈ నివాసంపై వైసీపీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటున్నారని, వరదల సమయంలో చంద్రబాబు నివాసం ముంపుకు గురవుతుందని ఆరోపణలు చేసేవారు.

చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ రాజకీయ వివాదాలు నెలకొనడంతో వాటన్నింటికి ముగింపు పలకాలని టీడీపీ అధినేత నిర్ణయం కృష్ణా నది ఒడ్డున ఉన్న నివాసం నుంచి షిఫ్ట్‌ కానున్నారు. ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేని రమేష్‌ చెందిన గెస్ట్‌హౌస్‌ స్థానంలో రాజధానిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

అమరావతిపై అన్ని వర్గాల్లో భరోసా కల్పించే క్రమంలో అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. కోర్‌ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి రూ.11వేల కోట్లతో పనుల్ని చేపట్టడానికి ఇటీవల అమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది కల్లా వీటిలో చాలా నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు.

ప్రస్తుత వెలగపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న స్థలాన్ని చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది. దాదాపు 25 వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డులో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న  భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి వ్యవసాయ భూములు స్వాధీనం చేసినందుకు గాను వారికి రిటర్నబుల్ ప్లాట్ కేటాయించారు. ముఖ్యమంత్రి నివాసానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని చంద్రబాబు నివాసం కోసం ఎంపిక చేశారు. సొంతింటి నిర్మాణం కోసం భూమి యజమానులతో సంప్రదింపులు జరిపి వారికి డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.

దాదాపు ఐదున్నర ఎకరాల ఈ భూమికి నాలుగు వైపులా రోడ్డు ఉంది. రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా ఈ భూమి పక్క నుంచి వెళుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్న మెంట్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చంద్రబాబు నివాసానికి రెండు కి. మీ. పరిధిలో ఉంటాయి.

దాదాపు ఐదున్నర ఎకరాల్లో ఉన్న భూమిలో ఇంటి నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం చంద్రబాబు కొనుగోలు చేసిన ఇంటి స్థలంలో భూమి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటితో పాటు పార్కింగ్‌, సిబ్బంది కోసం ఏర్పాట్లు చేస్తారు. వీలైనంత త్వరలో వెలగపూడిలో చంద్రబాబు ఇంటి నిర్మాణం మొదలయ్యే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అటంకాలు ఎదురు కాకుండా ఉండేలా రాజధానికి రూపురేఖలు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా ఇంటిని నిర్మించుకుంటే మరికొందరు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

2019లో ప్రభుత్వం మారక ముందే పలువురు ప్రముఖులు అమరావతిలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. రైతుల వాటాగా దక్కిన ఫ్లాట్లకు భారీ ధరలు లభించాయి. 2019లోనే చదరపు గజం 40-45వేల వరకు ధర పలికింది. తాజాగా చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు నిర్ణయంతో అమరావతి రియల్‌ ఎస్టేట్‌కు ఊపు వస్తుంది. మరోవైపు హ‍్యాపీనెస్ట్ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1200 రెసిడెన్షియల్ ఫ్లాట్లను నిర్మిస్తారు.

Whats_app_banner