Telangana Earthquake : ములుగులో 'భూకంపం' ఎందుకు వచ్చింది..? ముఖ్య విషయాలు-what are reasons for earthquake in telangana key points read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Earthquake : ములుగులో 'భూకంపం' ఎందుకు వచ్చింది..? ముఖ్య విషయాలు

Telangana Earthquake : ములుగులో 'భూకంపం' ఎందుకు వచ్చింది..? ముఖ్య విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 04, 2024 12:14 PM IST

Earthquake in Telugu States : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ములుగు జిల్లా మేడారం సమీపం కేంద్రంగా భూకంపం నమోదైంది.

ములుగులో భూకంపం
ములుగులో భూకంపం

భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. బుధవారం ఉదయం 7 గంటల తర్వాత ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటికి బయటకు పరుగులు తీశారు.

ఇక ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అయింది. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించిందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

తెలంగాణలో భూ ప్రకంపనలు ఎందుకు వచ్చాయి? ముఖ్య విషయాలు

  • భూమి లోపల పోరలతో నిర్మితమై ఉంటుంది. ఈ పోరలు లేదా పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. భూప్రకంపనలు వస్తాయి.
  • కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న స్థానాన్ని భూకంప కేంద్రం అంటారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే…. దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.
  • భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ పై రికార్డు చేస్తారు. రిక్టర్ స్కేల్ పై 05 నుంచి 5.9 వరకు రికార్డ్ అయితే… ఫర్నిచర్ అంతా కిందపడి పోయే విధంగా భూమి కంపిస్తుంది. 7 నుంచి 7.9గా ఉంటే భవనాలు కూలిపోతాయి. అల్లకల్లోల వాతావరణం సంభవిస్తుంది.
  • తెలంగాణలోని ములుగు జిల్లాలోని మేడారం సమీపంలో భూకంప తీవ్రత 05.0గా నమోదైంది. దీంతో కొన్ని సెకన్ల వ్యవధి పాటు భూమి కంపించింది.
  • ఈ స్థాయి భూకంపం 1969లో భద్రాచలంలో వచ్చింది. ఆ తర్వాత రావటం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో(ములుగు) తాజాగా భూకంపం ఏర్పడటానికి శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని.. భూమి లోపల పగుళ్లు ఏర్పడుతుంటాయని అంటున్నారు.
  • భూమి లోపల పొరల్లో జరిగే కొన్ని సర్దుబాటు కారణాలతో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేతలు చెబుతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు.
  • భూకంపాల విషయంలో తెలంగాణ ప్రాంతం సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ… నది పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉండే ఏరియాల్లో మాత్రం ఈ పరిస్థితి ఉండదని శాస్త్రవేతలు చెబుతున్నారు. భూపాలపల్లితో పాటు ములుగు ప్రాంతంలో గనుల తవ్వకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు కూడా భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.
  • భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే నష్టం వాటిల్లుతుందని విశ్లేషిస్తున్నారు.

భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. ఇక భారత్ లో చూస్తే నాలుగు సిస్మోక్ జోన్లు(జోన్ II, జోన్III, జోన్IV, జోన్V.) ఉంటాయి. ఇందులో తెలంగాణలో జోన్ 2లో ఉంది. ఈ జోన్ లో ఉండే ప్రాంతాలకు అత్యల్ప భూకంపాలకు అవకాశం ఉంటుంది.

"తెలంగాణలో తేలికపాటి భూ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌ భూకంపాలకు గురయ్యే ప్రాంతం కాదు. భూ ప్రకంపనలు తీవ్రస్థాయిలో లేవు" అని CSIR-NGRI డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాష్‌ కుమార్‌ చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం