కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు ఏ మాత్రం కూడా నష్టం వాటిల్లవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రావాల్సిన వాటా దక్కించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రిబ్యునల్ ఎదుటు సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సూచించారు.
శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో నీటి పారుదల ప్రాజెక్టులు, తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు.
రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం ఆంధ్ర, తెలంగాణల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై త్వరలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించడానికి అవసరమైన సమగ్ర వివరాలను సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉందని... ఏపీలో కేవలం 30 శాతం ఉందని చెప్పారు. అదే నిష్పత్తి ప్రకారం 1005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని సూచించారు.
సంబంధిత కథనం