Mulugu District: ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు, జిల్లా పేరు మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ
Mulugu District: ఉమ్మడి వరంగల్ లోని ములుగు జిల్లా పేరును మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా పేరు మార్పు వ్యవహారంపై కసరత్తు ప్రారంభించారు.
Mulugu District: ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదన మేరకు ములుగు జిల్లా పేరును 'సమ్మక్క సారలమ్మ ములుగు'గా మార్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకోగా.. మంగళవారం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
ప్రతి పంచాయతీ పరిధిలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి, పేరు మార్చే విషయంపై గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా మండల స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఎంపీడీవోలు, ఎంపీవోలకు బాధ్యతలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా.. రెండో విడతలో నారాయణ పేటతో కలిపి ములుగును 2019 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ములుగు అంతకుముందు వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండగా.. తొమ్మిది మండలాలు, దాదాపు 3 లక్షల జనాభాతో ములుగు జిల్లా ఏర్పాటైంది.
దీని పరిధిలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయి గూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉండగా.. వాటి పరిధిలో మొత్తంగా 336 గ్రామాలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలో మంగళవారం ఉదయం నుంచే గ్రామ సభలు నిర్వహించనున్నారు.
దాని ప్రకారం అధికారులు ముందుగా ములుగు జిల్లా రాజపత్రం అధికారిక ప్రచురణ ఫామ్ నెం.1 ని అన్ని గ్రామాల్లో నోటీస్ బోర్డుపై అతికించాలి. అనంతరం గ్రామంలో ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టి, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని సేకరించాలి. ప్రజల అభిప్రాయాలను మినిట్స్ రూపంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ ఇద్దరూ ధృవీకరించాలి. ఆయా గ్రామ సభలను మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పర్యవేక్షించాలి. గ్రామ సభ పూర్తి అయిన తరువాత తీర్మాన పత్రాన్ని మండల స్థాయి అధికారులు మినిట్స్ రూపంలో జిల్లా ఆఫీసర్లకు అందజేయాల్సి ఉంటుంది.
ప్రజల ఆకాంక్ష.. సీతక్క చొరవ
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళా గా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలోనే జరుగుతుంది. జిల్లా ప్రజలంతా సమ్మక్క సారలమ్మ తమ ఇలవేల్పుగా భావించి కొలుస్తుంటారు.
దీంతోనే ములుగు ప్రత్యేక జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. చాలా సందర్భాల్లో ఇక్కడి జనాలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్క జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టేందుకు కృషి చేస్తానని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు.
ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పేరు మార్పు ప్రతిపాదన పెట్టారు. ఇలా మంత్రి సీతక్క చొరవతో వన దేవతలైన సమ్మక్క సారలమ్మ పేరుతో ములుగు జిల్లాకు నామకరణం చేయనుండగా, గ్రామ సభల నిర్వహణ అనంతరం గెజిట్ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)