విశాఖపట్నంలోని మురళీనగర్ సింగరాయకొండపై దారుణం వెలుగులోకి వచ్చింది. సింగరాయి కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల కిందట్ పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణ మద్యం వ్యసనానికి బానిస అయ్యాడు. భారీగా అప్పులు చేశాడు. భార్య వద్ద ఉన్న బంగారాన్నీ తాకట్టు పెట్టాడు. ఈ విషయంపై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. నవంబర్ 23న కుమార్తె మొదటి పుట్టిన రోజు నాటికి బంగారాన్ని విడిపించాలని.. భార్య కృష్ణవేణి, తల్లిదండ్రులూ పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో భార్యను హత్య చేయాలని భర్త వెంకటరమణ భావించాడు. నవంబర్ 16న రాత్రి వెంకటరమణ మద్యం తాగాడు. తనతో పాటు తెచ్చిన మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను భార్యకు ఇచ్చాడు. ఆమె కూల్‌డ్రింక్ తాగగానే కల్లు తిరుగుతున్నప్పుడు గ్యాస్‌స్టవ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆమె దుస్తులపై పొడి చల్లి స్టవ్ వెలిగిస్తున్నానంటూ అగ్గిపుల్లను ఆమె దుస్తులపై వేశాడు. కళ్లెదుటే భార్య కాలిపోతున్నా తలుపు తీయకుండా అక్కడి ఉండి చూస్తున్నాడు.
మత్తు మందు ప్రభావం నుంచి కాస్త కోలుకున్నాక.. కృష్ణవేణి అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తీసుకుకెళ్లారు. గ్యాస్ స్టవ్ అంటుకుని తన భార్య కాలిపోయిందని స్థానికులను నమ్మించాడు. అందరూ అదే నమ్మారు.
ఆమెకు గొంతె దగ్గర బాగా కాలిపోవడంతో మాట్లాడలేకపోయిది. అయితే శనివారం కాస్తా కోలుకున్న కృష్ణవేణి ఏం జరిగిందో చెప్పింది. పోలీసులు వెంకటరమణపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)