Warangal Crime : కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తీవ్రంగా గాయాలపాలైన భర్త చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తప్పు చేస్తే కొట్టడమే కాకుండా వివిధ రకాలుగా హింసిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని అతడి భార్య, పెంపుడు కూతురు ఇద్దరూ కలిసి హతమార్చారు. ఇంట్లో ఉండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర కాలిన గాయాలైన ఆయన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి గ్రామానికి చెందిన కోటగిరి సునీల్(36) అనే యువకుడు దాదాపు 12 సంవత్సరాల కిందట హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండకు చెందిన మేకల లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అంతకుముందే లక్ష్మీకి వేరే వ్యక్తితో వివాహం జరగగా.. ఒక కూతురు పుట్టింది. కానీ ఆ తరువాత ఆమె భర్త చనిపోవడంతో కోటగిరి సునీల్ ను ఆమె రెండో వివాహం చేసుకుంది. ఇరువర్గాల అంగీకారం మేరకే సునీల్, లక్ష్మీ వివాహం జరిగింది. ఆ తరువాత కొంతకాలానికి వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. లక్ష్మీతో పాటు ఆమె కూతురు సిరి బాధ్యతలు కూడా కోటగిరి సునీలే చూసుకుంటున్నాడు.
ఫోన్ మాట్లాడొద్దని కొట్టినందుకు కిరాతకం
లక్ష్మీ మొదటి భర్తకు పుట్టిన సిరి కొద్ది రోజుల నుంచి ఓ యువకుడితో ఫోన్ లో మాట్లాడుతోంది. విషయం తెలుసుకున్న సునీల్ సిరిని మందలించాడు. కానీ ఆమె నుంచి సరైన సమాధానం లేకపోవడంతో భార్య లక్ష్మీతో పాటు సిరిని కొట్టాడు. తమను కొట్టిన విషయాన్ని లక్ష్మీ.. తన భర్త సునీల్ అక్క, ఊరుగొండలో ఉంటున్న నీరజ, ఆమె భర్త రవీందర్ కు చెప్పింది. దీంతో నీరజ, రవీందర్ దంపతులిద్దరితో పాటు మరో ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం శాయంపేట హవేలికి వెళ్లి సునీల్, లక్ష్మీ, సిరితో మాట్లాడారు.
ముగ్గురికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో మళ్లీ ఆదివారం మాట్లాడుదామని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి సునీల్ కు తన భార్య లక్ష్మీ, కూతురు సిరితో మళ్లీ గొడవ జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన లక్ష్మీ, కూతురు సిరి ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న పెట్రోల్ తీసి సునీల్ పై పోశారు. అనంతరం నిప్పంటించి ఇంటికి తలుపులు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.
కాగా సునీల్ ఒంటిపై మంటలు తట్టుకోలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల జనాలు గమనించి, పరుగున వచ్చి తలుపులు తెరిచారు. అప్పటికీ సునీల్ శరీరం సగానికిపైగా కాలిపోగా.. వెంటనే అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో శనివారం సునీల్ ప్రాణాలు విడిచాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
వరంగల్ ఎంజీఎంలో కోటగిరి సునీల్ మరణించగా.. అతడి అక్క నీరజ గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడి మృతికి కారణమైన లక్ష్మీ, ఆమె కూతురు సిరిపై తగిన చర్యలు తీసుకోవాలని దరఖాస్తు ఇచ్చారు. ఈ మేరకు గీసుగొండ సీఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సునీల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రదేశాన్ని మామునూరు ఏసీపీ తిరుపతి, గీసుగొండ సీఐ మహేందర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా లక్ష్మీ కూతురితో కలిసి తన భర్తను హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం