Warangal MGM : ఎంజీఎంలో 40 మంది డాక్టర్లు విధులకు డుమ్మా…! కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో బయటపడిన బాగోతం-warangal collector satya sharada devi inspects mgm hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Mgm : ఎంజీఎంలో 40 మంది డాక్టర్లు విధులకు డుమ్మా…! కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో బయటపడిన బాగోతం

Warangal MGM : ఎంజీఎంలో 40 మంది డాక్టర్లు విధులకు డుమ్మా…! కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో బయటపడిన బాగోతం

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 06:38 AM IST

Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఏం ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. ఆస్పత్రిలో వైద్యాధికారులు పని తీరు చూసి తీరు చూసి కలెక్టర్ కంగుతిన్నారు

ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్
ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్

Warangal MGM Hospital : పేదల ఆసుపత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి చూసి కలెక్టర్ షాక్ అయ్యారు. నిత్యం వేలాది మంది వైద్య సేవల కోసం వచ్చే ఆసుపత్రిలో దాదాపు 40 మంది డాక్టర్లు పైస్థాయి అధికారులకు సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టగా.. ఓ డాక్టర్ ఏకంగా నెల రోజుల రిజిస్ట్రర్ లో ఒకేసారి సంతకాలు పెట్టేసి వెళ్లిపోయారు.

దీంతో శనివారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారుల తీరు చూసి కంగుతిన్నారు. వెంటనే కొంతమంది డాక్టర్లకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ను ఆదేశించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఇటీవల వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సత్యశారదా దేవి శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితిని గమనించిన ఆమె.. శనివారం మరోసారి ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బంది వ్యవహార శైలి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

40 మంది డుమ్మా కొట్టడంపై ఫైర్…

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ సత్యశారదా దేవి ముందుగా ఓపీ విభాగంలోని సర్జికల్, మెడికల్, ఆర్థోపెటిక్, డెర్మటాలజీ, డెంటల్ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం ఇన్ పేషంట్ విభాగాల్లో తనిఖీ చేసి, అత్యవసర విభాగంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి డాక్టర్లు, ఎంజీఎం సిబ్బంది అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్య సేవలందించడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గ్రహించి, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తర్వాత రేడియాలజీ వింగ్ ను పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో మొత్తం డాక్టర్ల అటెండెన్స్ పై ఆరా తీశారు. దీంతో దాదాపు 40 మంది డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుసుకుని ఎంజీఎం ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యారు. అంత మంది సిబ్బంది ఒకేసారి అందుబాటులో లేకుండా పోతే.. వైద్య సేవలు ఎలా అందుతాయని, పట్టించుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్టు అని మండిపడ్డారు. వెంటనే వారందరికీ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఎంజీఎం సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇచ్చారు.

నెల మొత్తం సంతకాలు…

ఎంజీఎం ఆసుపత్రిలో పరిస్థితిని గమనించిన కలెక్టర్ సత్యశారదా దేవి డాక్టర్ల అటెండెన్స్ రికార్డ్స్ పరిశీలించారు. కాగా చిన్న పిల్లల విభాగమైన పిడియాట్రిక్ ప్రొఫెసర్ శ్యామ్ ప్రసాద్ తీరు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై నెలలో ఒక్క వారం కూడా పూర్తిగా గడవక ముందే నెల మొత్తం హాజరు అయినట్టు సంతకాలు పెట్టుకోవడం, డ్యూటీలో ఆయన కనిపించకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు.

దీంతో ఎంజీఎం పర్యవేక్షణ గాడి తప్పిందని, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరగుతోందని ఫైర్ అయ్యారు. ఇలా సంతకాలు పెట్టి విధులకు గైర్హాజరు అయ్యేవాళ్లు ఎంజీఎంలో చాలామందే ఉన్నారని, వెంటనే ఆ లిస్ట్ ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దుకాణాల నుంచి డెవలప్మెంట్ ఫండ్ ఎందుకు వసూలు చేయడం లేదని కలెక్టర్ సూపరింటెండెంట్ ను ప్రశ్నించారు. దుకాణాలు, డబ్బాలు, హోటల్ ల వద్ద హాస్పిటల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద రావాలసిన డబ్బును వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడి నుంచి నేరుగా సూపరింటెండెంట్ ఆఫీస్ రూమ్ కు చేరుకున్నారు. సూపరింటెండెంట్ కు ఉన్న ఛాంబర్ ను చూసి, దానిని రోగులకు వార్డుగా మార్చాలని ఆదేశించారు. ఆసుపత్రులకు రోగులకు నిలబడే స్థలం కూడా ఉండటం లేదని, అలాంటప్పుడు సూపరింటెండెంట్ కు ఇంత పెద్ద ఆఫీస్ రూమ్ అవసరమా అని ప్రశ్నించారు.

విధులకు డుమ్మా కొట్టిన వైద్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో తాను సూచించిన మార్పులు చేయాలని ఆదేశించారు. సోమవారం లోగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కు సూచించారు.

నర్సులపైనా ఆగ్రహం

రోగుల పట్ల కొందరు నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవలను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. అలాగే నర్సింగ్ హాస్టల్ విద్యార్థులను వారంలోగా ఆ బిల్డింగ్ ఖాళీ చేయించాలని ఆదేశించారు.

ప్రభుత్వం కొత్త భవనం నిర్మించేంత వరకు ఆ పాత భవనంలో ఎవరినీ ఉంచకూడదని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో పరిస్థితులపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాణితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంజీఎంకి అతిపెద్ద ఆసుపత్రిగా పేరు ఉందన్నారు.

ఇంత పెద్ద ఆసుపత్రికి సమాచారం కోసం ఒక పోర్టల్ లేదని, త్వరలో పోర్టల్ ను తీసుకువస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, లేదంటే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. ఇదిలాఉంటే ఎంజీఎం డాక్టర్ల వైఖరిపై చాలా ఏళ్ల నుంచి ఇవే ఫిర్యాదులు ఉండగా, సూపరింటెండెంట్, కలెక్టర్ స్థాయి అధికారులు ఎన్నడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కలెక్టర్ సత్యశారదా దేవి స్పెషల్ ఫోకప్ పెట్టడంతో ఇకనైనా ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తీరులో మార్పులు వస్తాయో లేదో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

టాపిక్