GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ-tg govt released guidelines for go 317 for govt employees transfers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Go 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

Bandaru Satyaprasad HT Telugu
Nov 30, 2024 11:02 PM IST

GO 317 Guidelines : జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట కల్పించింది. స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జీవో 317 సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేసింది.

జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ
జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

జీవో 317కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జీవో 317 సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేసింది. సీఎస్ శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎస్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీచేశారు. ఖాళీలకు అనుగుణంగా లోకల్ కేడర్‌లో మార్పు, బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.

జీవో 317 బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పిచింది. స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒకే సబ్జెక్టు చెప్పే ఇద్దరు ఉద్యోగులు ఒకరి ప్లేస్ లోకి మరొకరు పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశాన్ని కల్పించారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ లో అప్లైకు అవకాశం కల్పించనున్నారు. ఆ మేరకు జీవో 245ను సీఎస్ జారీ చేశారు.

అసలేంటీ జీవో 317?

2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. తెలంగాణ విభజనకు ముందు మొత్తం పది జిల్లాలు జోన్-5, జోన్-6 కింద ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌వ్యవస్థీకరించారు. దీనిని 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిది. ఈలోగా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా మూడంచెల కేడర్లకు రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటం, కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు, ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఈ మేరకు 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ 317 జీవోను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులకు... పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్లకు సీనియారిటీని ప్రాతిపదికగా నిర్ణయించారు. వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిచారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోతే సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి అవకాశం లభించదు. దీంతో ఉద్యోగులకు తమ సొంత జిల్లాలో అయినా పోస్టింగ్ లభించదు. దీనిపై అప్పట్లో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం