Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!-naxals killed in encounter on eturunagaram agency in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!

Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2024 10:24 AM IST

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ ను ములుగు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం - మావోయిస్టు మృతదేహాం
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం - మావోయిస్టు మృతదేహాం

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  గ్రేహౌండ్స్ బలగాలు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. ఇందులో ఇద్దరు కీలక నేతలు ఉన్నారు.

ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్ కౌంటర్ ను ములుగు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. ఇక ఈ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయినవారి పేర్లు బయటికి వచ్చాయి. 

  1. కుర్సుం మంగు అలియా బద్రు అలియాస్ పాపన్న,  TSCM కార్యదర్శి, ఇల్లందు నర్సంపేట.
  2. మల్లయ్య అలియాస్ మధు, డీవీసీఎం కార్యదర్శి, ఏటూరు నాగారం - మహాదేవ్ పురం డివిజన్.
  3. కరుణాకర్ , ఏసీఎం.
  4. జమునా - ఏసీఎం.
  5. జైసింగ్ - పార్టీ మెంబర్.
  6. కిషోర్ - పార్టీ సభ్యుడు.
  7. కామేశ్ - పార్టీ సభ్యుడు.

మరోవైపు  పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుండి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. కొయ్యూరు ఎన్ కౌంటర్ కు పాతికేళ్ళు అవుతున్న నేపథ్యంలో వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విప్లవోద్యమ నిర్మూలనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘కగార్’ విప్లవ ప్రతీఘాతుక యుద్ధాన్ని తిప్పికొడుతామని ప్రకటించింది.

2024 డిసెంబర్ 2 నాటికి పీ.ఎల్.జీ.ఏ కి 24 సంవత్సరాలు నిండుతాయి. 24 సంవత్సరాల వార్షికోత్సవాలను పురష్కరించుకొని డిసెంబర్ 2 నుండి 8 వరకు పీ.ఎల్.జీ.ఏ వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాహంతో జరపాల్సిందిగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు, పార్టీ కమిటీలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయ సాధన కోసం ప్రజాయుద్ధం కొనసాగిస్తున్న పార్టీ పీ.ఎల్.జీ.ఏ అని స్పష్టం చేసింది. తెలంగాణలో శతృవు కల్పించిన ప్రతికూల పరిస్థితుల నడుమ విప్లవోద్యమ ప్రజా పునాదిని బలోపేతం చేయడానికి గత సంవత్సర కాలంగా కృషి చేసౌన విప్లవకారులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ అభివందనాలు తెలియ జేసింది.

ఓవైపు వార్షికోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో… ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరగటంతో ఏటూరు నాగారం దండకార్యణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్ కౌంటర్ లో పలువురు కీలక నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చల్పాక అటవీ ప్రాంతమంతా పోలీసుల కూంబింగ్ నడుస్తున్నట్లు తెలిసింది. 

Whats_app_banner