Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల-minister seethakka fulfills promise new mandal established in mulugu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల

Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల

HT Telugu Desk HT Telugu
Nov 29, 2024 09:20 AM IST

Mulugu New Mandal: ములుగు జిల్లాలోని మల్లంపల్లి వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. మల్లంపల్లిని ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటించాలని కొన్నేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తుండగా.. స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరింది.

ములుగు జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు హామీ నెరవేర్చిన మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు హామీ నెరవేర్చిన మంత్రి సీతక్క

Mulugu New Mandal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ జీవో 125ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. మల్లంపల్లి, రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాలతో పాటు వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలను కలిపి ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా మల్లంపల్లి ప్రజలు చేస్తున్న పోరాటానికి తెరపడినట్లైంది.

మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్

రాష్ట్ర ప్రభుత్వం 2016 లో జిల్లాల పునర్విభజన చేపట్టి.. ఉమ్మడి వరంగల్ ను ఐదు జిల్లాలుగా విభజించింది. దీంతో ములుగు ను కూడా జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు మల్లంపల్లిని ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటించాలని అప్పట్లో పోరాటాలు జరిగాయి. దీంతో 2019 ఫిబ్రవరి నెలలో ములుగును జిల్లాగా ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మల్లంపల్లి ప్రత్యేక మండల డిమాండ్ మాత్రం అలాగే పెండింగ్ లో పడిపోయింది.

ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియ తెరమరుగైంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లంపల్లి మండల ఏర్పాటు పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం మల్లంపల్లి ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ 125జీవో విడుదల చేశారు.

జిల్లాలో పదో మండలంగా మల్లంపల్లి

ములుగును జిల్లాగా ప్రకటించిన సమయంలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటైన కన్నాయిగూడెం, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను కలుపుతూ మొత్తం 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు.

గురువారం ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులతో మల్లంపల్లి జిల్లాలో పదో మండలంగా అవతరించింది. కాగా నూతనంగా ఏర్పాటైన మల్లంపల్లి మండల పరిధిలో మల్లంపల్లి, ఎండీ గౌడ్ పల్లి, పందికుంట, రాంచంద్రాపురం, కొడిశలకుంట, శివతండా, ముద్దునూరు తండా, దేవ నగర్, గుర్తూరు తండా, శ్రీనగర్ గ్రామపంచాయతీలు కొనసాగనున్నాయి.

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ప్రత్యేక మండలం ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తుండగా.. ప్రభుత్వం ఇచ్చిన జీవో తో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవానికి మల్లంపల్లిని ములుగు మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నేత, దివంగత కుసుమ జగదీష్ పేరున ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం మల్లంపల్లి పేరుతోనే జీవో విడుదల చేయగా.. కొందరు బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే స్థానికులు మాత్రం మల్లంపల్లిని ప్రత్యేక మండలం చేయాలనే డిమాండ్ తో చేసిన పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలకు ఎట్టకేలకు మోక్షం కలిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర మంత్రి సీతక్కకు కృతజ్క్షతలు తెలిపారు. ఈ మేరకు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner