Pending Projects: పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి… లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న ఉత్తమ్
Pending Projects: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే నాలుగేళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Pending Projects: కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్ళు, చెల్లింపులు తదితర అంశాలపై రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ విషయమే ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమను సంప్రదించాలని సూచించారు. అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించామని స్పష్టం చేశారు.
చిన్న కాళేశ్వరం, పత్తిపాక ప్రాజెక్టు...
పెద్దపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఇచ్చిన మాట ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్ట్ లను ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 9,10, 11, 12 మిగితా పని పూర్తి చేసేందుకు కావలిసిన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, డాటా ఎంట్రీ వేగంగా పూర్తి చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు రోజుల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాల మేరకు సన్న రకం ధాన్యం సేకరణ పకడ్బందీగా చేయాలని రైతుల ఖాతాల్లో రూపాయాలు 500 బోనస్ పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
జనవరి నుంచి రేషన్ షాప్ లో సన్నబియ్యం...
జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. సంక్షేమ హాస్టల్ లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తున్నందున అందుకు 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న వడ్లు ఎక్కువ మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని అన్నారు.
84% చెల్లింపులు పూర్తి- కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ధాన్యం కొనుగోలు గురించి మంత్రికి వివరించారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 53,512 మెట్రిక్ టన్నుల సన్న రకాలు, 1,23,208 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,76,720 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు సుమారు 345 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు.
మొత్తంగా 84 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని, త్వరలోనే మిగతావి చెల్లిస్తామని అన్నారు. సన్న రకాల రైతులకు 11.18 కోట్ల రూపాయల బోనస్ చెల్లించామని తెలిపారు. గత మూడు రోజుల నుండి కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో సన్నవడ్లు వస్తున్నాయని, నూరు శాతం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)