Prakasam Barrage : కృష్ణా నదికి మరోసారి వరద ఉద్ధృతి! ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం, సాగర్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద తరలివస్తోంది. దీంతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గేట్లు కొంతమేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది.
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత:
కృష్ణా వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నది దాటే ప్రయత్నాలు చేయరాదని స్పష్టం చేశారు.
ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నుంచి 1,85,170 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతుంది. దీంతో సాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి 1,89,312 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా… మొత్తం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా 312.05 గా ఉంది. ఈ ఏడాది కర్ణాటకలో కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ పోటెత్తింది. ఆగస్ట్ నుంచి ఇప్పటికే పలుమార్లు పూర్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
శ్రీశైలం ప్రాజెక్టులో చూస్తే నీటిమట్టం 884.8 అడుగులుగా ఉంది. మొత్తం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 214.84 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 1,97,641 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 1,85,170గా ఉంది.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 173.88 అడుగుల నీటిమట్టం ఉంది. 45.77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,28,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 1,34,707 క్యూసెక్కులుగా ఉంది.