Vijayawada Teppotsavam Cancel : వరద ఉద్ధృతితో విజయవాడ తెప్పోత్సవం రద్దు, ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు పూజలు
Vijayawada Teppotsavam Cancel : కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉద్దృతంగా ఉండడంతో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై ఉంచి పూజలు నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు చివరి రోజు అమ్మవారు కృష్ణా నదిలో హంస వాహనం విహరిస్తారు. ఆనవాయితీగా జరిగే దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి బ్రేక్ పడింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు పై నుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నదీ విహారం రద్దు చేసినట్లు అధికారుల తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులకు కన్నుల పండువగా సాగే హంస వాహనం కృష్ణానది నీటి ప్రవాహంతో రద్దు కావడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.
దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో ఉంచి మూడుసార్లు జలవిహారం చేయించడం ఆనవాయితీ. అందుకు అనుగుణంగా దేవాదాయ, జలవనరుల శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే వరద నీరు కారణంగా తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. నదీ విహారానికి అనుమతి లేనందున ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్షం వచ్చి ఆటంకాల ఎదురైతే మాత్రం మహామండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా నదికి 40,616 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రస్తుతం వస్తుండడంతో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద 25 గేట్లను అడుగు మేర పైకెత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తెప్పోత్సవ నిర్వహణ సాధ్యపడడం లేదు. తెప్పోత్సవం కోసం ఇప్పటికే హంస వాహనాన్ని సిద్ధం చేశారు. దాన్ని దుర్గాఘాట్ వద్ద ఉంచినప్పటికీ నీటి ప్రవాహ స్థాయి ఎక్కువగా ఉండటంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేశారు. కృష్ణానదికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోతేనే ఈ ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అనుమతి ఇస్తుంది. ఒకేవేళ ఇన్‌ఫ్లో ఉంటే 10 వేల క్యూసెక్కులలోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే జలవనరుల శాఖ అనుమతి ఇవ్వదు.
విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి ఉత్సవాల చివరి రోజు కావడంతో తండోపతండాలుగా భక్తులు భారీగా ఇంద్రకీలాద్రి వైపు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటాన్నారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకోవడం విశేషం. కొండ దిగువ నుంచి భక్తులు కిటకిటలాడుతూ “జైదుర్గ...జైజై దుర్గ” నామస్మరణతో ముందుకు సాగుతున్నారు.
ఉత్సవాల ముగింపు రోజైన శనివారం రాత్రి నిర్వహించే తెప్పోత్సవం కోసం భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అయితే కృష్ణానదిలో నీటి ప్రవాహం కొనసాగుతుంటంతో దర్గాఘాట్ వద్దనే హంసపై పూజులు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం