SaraswatiDevi: సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు… ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
SaraswatiDevi: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది.
SaraswatiDevi: ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా దర్శనమిస్తోంది.
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం తిధి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమతుల మేరకు అమ్మవారి దర్శనానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది.
ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రత్యేక బృందం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు డా. కె.మురళీమోహన్ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, దుర్గా శరన్నవరాత్రుల సందర్భంగా ఏటా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతోందని.. ఈ ఏడాది జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
జగన్మాత మహాలక్ష్మిని దర్శించుకున్న డీజీపీ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను మంగళవారం మహాలక్ష్మి రూపంలో రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు సతీసమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని వివరించారు. విఐపి దర్శనాల కోసం వస్తున్న భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని, అటువంటి సందర్భాలలో పోలీసులు సహనంతో బాధ్యత నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ సమయోచితంగా వ్యవహరించాలన్నారు.
అర్థరాత్రి నుంచి వేచి ఉన్న భక్తులు..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం పర్వదినం నాడు అమ్మవారి దర్శనం కోసం భక్తులు అర్థరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. నేడు అమ్మవారి దర్శనానికి అందరిని ఉచిత క్యూ లైన్ల లోనే పంపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
ఇంతవరకు కొనసాగిన 100, 300,500 రూపాయల టికెట్లతో పాటు వీఐపీ దర్శనాలు వంటివేవి 9వ తేదీన ( మూలా నక్షత్రం రోజున )ఉండవని, ఏర్పాటుచేసిన క్యూలైన్లు అన్నింటి ద్వారా భక్తులందరికీ అమ్మవారి దర్శనం ఉచితంగానే కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి ఏటా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్యలో కుటుంబ సమేతంగా అమ్మవారి గుడికి రానున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా, భద్రతా కారణాల రీత్యా ఆ సమయంలో పరిమిత సంఖ్యలోనే ప్రజా ప్రతినిధులను, అధికారులను దేవాలయంలో నికి అనుమతించాలని నిర్ణయించామని తెలిపారు. కేవలం సీఎం,వారి కుటుంబ సభ్యులు మాత్రమే అంతరాలయంలోకి వెళతారని వివరించారు.
పూజా కార్యక్రమాల అనంతరం సమయం అనుకూలిస్తే దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం చూస్తారని మంత్రి ఆనం వెల్లడించారు.
ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఐదు క్యూ లైన్ ల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కలిగించేలా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.