Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు-krishna river projects almost reached complete water levels srisailam sagar pulichintala gates opened ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

HT Telugu Desk HT Telugu
Sep 07, 2024 09:52 PM IST

Krishna River Projects : తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తో్న్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణనది ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తు్న్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ప్రాజెక్టుల గేట్లు దాదాపుగా తెరిచే ఉంచుతున్నారు.

కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు
కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

Krishna River Projects : దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా , గుంటూరు, ఒంగోలు జిల్లాలకు వరదాయినిగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. గడిచిన నెల రోజులుగా సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోయి కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద తాకిడిని తట్టుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నీటికి దిగువకు వదిలేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదీపరివాహక ప్రాంతంలో, అదే మాదిరిగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరదనీరు పోటెత్తుతోంది. ఆల్మట్టి పూర్తిగా నిండిపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నారాయణపూర్ కు అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాలలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడంతో ఆ ప్రాజెక్టుకు అనుంబంధంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తూనే దిగువ కృష్ణాలోకి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వదర పోటెత్తుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. కానీ, వరద ఎక్కవగా వస్తుండడంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా దగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కుడి ఎడమ కాల్వలకు నీరు విడుదల చేస్తూనే, కుడి, ఎడమ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అంతే కాకుండా సాగర్ వెనుక జలాలపై ఆధారపడిన ఏఎమ్మార్పీకి నీటిని విడుదల చేస్తున్నారు. అయినా, వరద తాకిడి ఎక్కువగా ఉండంతో దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో టెయిల్ పాండ్ పూర్తిగా నిండిపోయింది. టెయిల్ పాండ్ నుంచి విడుదలవుతున్న నీరు పులిచింతల ప్రాజెక్ట్ ను నింపేసింది. దీంతో పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూనే దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.

నిండు కుండల్లా ... కృష్ణా ప్రాజెక్టులు

తెలంగాణ పరిధిలోని కృష్ణా ప్రాజెక్టులు నీటితో నిండిపోయి నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్ట్ ఎఫ్.ఆర్.ఎల్ 318.40 మీటర్లకు గాను ప్రస్తుతం 318.15 మీటర్లతో 9.41 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. అదనంగా వస్తున్న నీరంతా దిగువకువదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతో పాటు, సుంకేసుల హంద్రీల ద్వారా అత్యధికంగా వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 2,44,722 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను 10 అడుగులమేర గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ లోకి 2,63,375 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుతం 884.50 అడుగుల నీరు ఉంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ గడిచిన నెల రోజులుగా పూర్తి స్థాయి నీటిమ్టటంతో జల కళతో కళకళలాడుతోంది. ఎగువ నుంచి అనూహ్యమైన ఇన్ ఫ్లో ఉండడంతో ప్రాజెక్టు గేట్లు దాదాపుగా పూర్తిగా ఎత్తే ఉంటున్నాయి. శనివారం నాడు కూడా ప్రాజెక్టుకు ఉన్న 26 ప్రధాన గేట్లలో 24 గేట్లను ఎత్తి కృష్ణాజలాలను కిందకు వదులుతున్నారు. 590 అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే సాగర్ జలాశయంలో ఇప్పుడు 589.90 అడుగుల నీరుంది. ఎగువ నుంచి 2,63,431 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 311.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదే సమయంలో 42 టీఎంసీల వద్ద ఉన్న పులిచింతలకు సాగర్ నుంచి వరద ఎక్కువగా వెళుతోంది. 173.8 అడుగుల నీటిమట్టం ఉండే పులిచింతల పూర్తిగా నిండిపోయి ఉంది. 2,52,920 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2,55,698 క్యూసెక్కుల నీటిని దిగువన ప్రకాశం బ్యారేజ్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో నిండి కళకళలాడుతున్నాయి. రెండు పంటలకు సాగునీటికి ఇక ఢోకా లేదన్న ఆనందంలో రైతాంగం ఉంది.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

Whats_app_banner

సంబంధిత కథనం