AP Heavy Rains: వరదలతో విలవిల, మళ్లీ భారీ వర్షాలు.. ఆందోళనలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రజలు-heavy rain in vijayawada half of the city is still flooded ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heavy Rains: వరదలతో విలవిల, మళ్లీ భారీ వర్షాలు.. ఆందోళనలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రజలు

AP Heavy Rains: వరదలతో విలవిల, మళ్లీ భారీ వర్షాలు.. ఆందోళనలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రజలు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 09:51 AM IST

AP Heavy Rains: ఓ వైపు కృష్ణా వరదలు మరోవైపు బుడమేరు ఉగ్రరూపంతో విలవిలలాడుతున్న ప్రజలను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.బుధవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం తడిచి ముద్దైంది.వరద గండ్లను పూడ్చడానికి శ్రమిస్తున్న అధికారులకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. వర్షంలోనే పనులు జరుగుతున్నాయి.

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు, బెంబేలెత్తుతున్న ప్రజలు
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

AP Heavy Rains: వరదల నుంచి తెరుకోక ముందే బంగాళఖాతంలో ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో బుడమేరు గండ్లను పూడ్చే పనులకు ఆటంకం ఏర్పడింది. గత నెల 30వ తేదీ నుంచి కురుస్తున్న వర్షాలకు కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. విజయవాడ నగరం ముంపు నుంచి ఆరో రోజు కూడా తేరుకోలేకపోయింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళావాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళా ఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది.

ద్రోణి ప్రభావంతో గురువారం నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమ రావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈ సారి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంద్రలో భారీ వర్షాలకు అవకాశముంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం వరకూ మత్స్యకారులు సముద్రం లోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామని ఐఎండి విశాఖ కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు.

రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో దాని ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా అల్పపీడనం కూడా వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ఉత్తరాంద్ర పరిసరాల్లో తీరందాటేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం…

ఐఎండి సూచనల ప్రకారం ఆవర్తన ప్రభావంతో పశ్చిమమధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

పెరుగుతున్న గోదావరి వరద…

మరోవైపు గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుందని బుధవారం రాత్రి 8 గంటల నాటికి భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం ఉందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,00,706 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. గురువారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కృష్ణానది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద 8 గంటల నాటికి 3.08 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. కృష్ణా,గోదావరి నదీ పరివాహాక ప్రజలు, లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది,వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

నేడు కేంద్ర బృందం పర్యటన…

రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో 5వ తేది గురువారం కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది. సంజీవ్ కుమార్ జిందాల్ కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డియం అండ్ పియం) నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది.

ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిడిఎంఏ) సలహాదారు (OPS&Comn) కల్నల్ కెపి.సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్(CWC) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసిసి) యం.రమేశ్ కుమార్,ఎన్డి ఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్.గిరిధర్, ఎన్డి ఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్నలతో కూడిన కేంద్ర బృందం గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.