Vijayawada Traffic Diversions : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
Vijayawada Traffic Diversions : దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా నేపథ్యంలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. అక్టోబర్ 13 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీగా ట్రాఫిక్ నెలకొంటున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ మీదుగా రాకపోకల్లో మార్పులు చేశారు. అక్టోబర్ 13 వరకు ఈ మార్పులు అమలులో ఉంటాయి. విజయవాడ నగరం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, పెనమూడి వారధి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చిన్న వాహనాలను గన్నవరం, నిడమానూరు, బెంజిసర్కిల్, కనకదుర్గమ్మ వారిధి మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. ఒకవేళ రామవరప్పాడు వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగితే, దాడిగడప 100 అడుగుల రోడ్డు మీదుగా బందరురోడ్డు, అక్కడి నుంచి బెంజిసర్కిల్ మీదుగా వాహనాలు మళ్లిస్తారు. తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో వాహనాలు వస్తాయి.
గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను బుడంపాడు, తెనాలి, మేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వారధి, చల్లపల్లి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమన్ జంక్షన్ బైపాస్ మీదుగా ఏలూరు, విశాఖపట్నం వైపు వాహనాలను మళ్లిస్తారు. చిన్న వాహనాలను గుంటూరు, కనకదుర్గమ్మ వారిధి, బెంజి సర్కిల్ పై వంతెన, రామవరప్పాడు, నిడమానూరు, గన్నవరం మీదుగా మళ్లిస్తారు. తిరిగి ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో వాహనాలు వస్తాయి.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం రింగ్, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. అదే విధంగా చిన్న వాహనాలను ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వై.కూడలి, కుబేలా సెంటర్, సీవీఆర్ పైవంతెన, పైపులరోడ్డు, కండ్రిక, బోడపాడు ఆర్‌యూబీ, ఔటర్ రింగ్‌రోడ్డు, ముస్తాబాద, చిన అవుటపల్లి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. తిరిగి ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో వాహనాలు ప్రయాణిస్తాయి.
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను నార్కెట్‌పల్లి, నల్లొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నైకు మళ్లిస్తున్నారు. చిన్న వాహనాలను ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, స్వాతి కూడలి, కనకదుర్గా పై వంతెన, కృష్ణలంక, కనకదుర్గమ్మ వారధి, తాడేపల్లి మీదుగా చెన్నైకు మళ్లిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇదు మార్గంలో వాహనాలు వస్తాయి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం