Nagarjuna Sagar: తెరుచుకున్న నాగార్జున సాగర్ గేట్లు, దిగువకు నీటి విడుదల, పులిచింతలకు కృష‌్ణమ్మ పరవళ్లు…
Nagarjuna Sagar: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో ఏపీలో ప్రాజెక్టులు క్రమంగా నిండుతున్నాయి. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టానికి చేరడంతో సాగర్ కూడా క్రమంగా నిండుతోంది. దీంతో సాగర్ ఐదు గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar: నీళ్లు లేక రాళ్లు తేలిన సాగర్ క్రమంగా నిండుతోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీరు చేరడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అధికారులు దిగువ కృష్ణ లోకి నీటిని విడుదల చేస్తున్నారు . సోమవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు చెందిన ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తారు.
ఎగువలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుచుండడంతో సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరలో ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్లో 585 అడుగుల నీటిమట్టానికి చేరింది.
సోమవారం కృష్ణమ్మకు పూజలు నిర్వహించిన జలవనరుల శాఖ అధికారులు గేట్లను ఎత్తారు. కాగా సాగర్‌లో 312 టిఎంసీల నీటి నిల్వ సామర్ధ్యానికి గాను, ప్రస్తుతం 300 టీఎంసీల లకు చేరుకుంది. దిగువకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను, నది పరీవహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 3.48లక్షల క్యూసెక్కులు ఉండగా సాగర్ నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది కాలంలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోయాయి. ఈ ఏడాది ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జల కళను సంతరించుకుంటున్నాయి.
( క్రాంతి పద్మ, నల్గొండ)