Fengal Cyclone Landfall : తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు-పలు విమానాలు రద్దు
Fengal Cyclone Landfall : ఫెంగల్ తుపాను తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకినట్లు ఐఎండీ పేర్కొంది. మరో 3-4 గంటల్లో తుపాను తీరం దాటనున్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఫెంగల్ తుపాను తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకింది. తుపాను తీరాన్ని దాటేందుకు 3-4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను తీరాన్ని తాకిన సమయంలో 80-90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రానున్న 3-4 గంటల పాటు 90 కి.మీ వేగంగా గాలులు వీచనున్నట్లు ఐఎండీ తెలిపింది.
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి పేర్కొంది. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. రెడ్ హిల్స్ వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో ఏపీ-చెన్నై మధ్య రాకపోకలు నిలిచాయి. చాలా చోట్ల రైల్ ట్రాక్ ల పైకి నీరు చేరడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు.
ఫెంగల్ తుపాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విమాన సర్వీసులకు అంతరాయం
ఫెంగల్ తుపాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ముంబై, త్రిపుర వెళ్లే పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు.