Srisailam : శ్రీశైలం వైపు వెళ్లొద్దు.. నాగర్ కర్నూల్ పోలీసుల హెచ్చరిక-nagar kurnool police has warned against traveling on srisailam ghat road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Srisailam : శ్రీశైలం వైపు వెళ్లొద్దు.. నాగర్ కర్నూల్ పోలీసుల హెచ్చరిక

Srisailam : శ్రీశైలం వైపు వెళ్లొద్దు.. నాగర్ కర్నూల్ పోలీసుల హెచ్చరిక

Basani Shiva Kumar HT Telugu
Sep 01, 2024 03:12 PM IST

Srisailam : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఇక ఘాట్ రోడ్డుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నాగర్ కర్నూల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డు
శ్రీశైలం ఘాట్ రోడ్డు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. శ్రీశైంలం వైపు వెళ్లొద్దని నాగర్ కర్నూల్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే ఆ మార్గంలో ప్రయాణించొద్దని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాండ్ సూచించారు. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లమల కొండల మీద నుండి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వస్తోంది. శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం ఆలయం మీదకు వరద నీరు జాలు వారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వరద ఉధృతంగా వస్తోందని అధికారులు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని.. పోలీసులు సాహసోపేతంగా కాపాడారు.

అందరూ అలెర్ట్..

భారీ వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ మంత్రులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. తాజాగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా నియోజకవర్గాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేషనల్‌ హైవేలపై కూడా వరద ప్రవహిస్తోంది. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. చెరువులకు గండ్ల వల్ల గ్రామాల్లోకి వరద వస్తోంది. చాలా ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు చేపట్టాం' అని మంత్రి పొంగులేటి వివరించారు.

పునరావాస కేంద్రాలకు వెళ్లాలి..

'రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావొద్దు. అధికారులతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు.. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి. హైదరాబాద్‌లో పురాతన భవనాల్లో ఉన్నవారు.. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

అండగా నిలవాలి..

'ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి. ఉత్తరాంధ్ర, కోస్తాపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ, గుంటూరులో 10 మంది మృతిచెందడం బాధాకరం. అధికార యంత్రాంగంతో పాటు.. జనసేన నేతలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. భారీ వర్షాలపై చిరంజీవి ట్వీట్ చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేస్తున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు.