India U19 vs Pakistan U19: అండర్-19 ఆసియా కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే భారత్‌కి చేదు అనుభవం.. దాయాది చేతిలో చిత్తు
ACC U19 Asia Cup: యూఏఈ ఆతిథ్యం ఇస్తున్న అండర్-19 ఆసియా కప్‌ని ఓటమితో భారత్ యువ జట్టు ప్రారంభించింది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ ఒక్క పరుగుకే ఔటైపోవడంతో.. మ్యాచ్‌లో..?
యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే భారత్‌కి చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 43 పరుగుల తేడాతో యువ భారత్ జట్టు ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకి అమ్ముడుపోయిన బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌కి చేరిపోయాడు.
సెంచరీ బాదిన పాక్ ఓపెనర్
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్ -19 టీమ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ సెహజైద్ ఖాన్ (159: 147 బంతుల్లో 5x4, 10x6) భారీ సెంచరీ నమోదు చేశాడు. అతనితో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (60: 94 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ బాదడంతో.. పాకిస్థాన్ మెరుగైన స్కోరుని నమోదు చేయగలిగింది. భారత బౌలర్లలో నటరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గుహ, కిరణ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో చేతులెత్తేసిన భారత్
282 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ జట్టుకి ఆది నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఓపెనర్‌గా ఆడిన వైభవ్ సూర్యవంశీ 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే ఔటైపోగా.. మరో ఓపెనర్ ఆయూష్ (20)తో పాటు నెం.3లో ఆడిన సిద్ధార్థ్ (15).. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ ఆమాన్ (16), కిరణ్ (20) తక్కువ స్కోరుకే ఔటైపోయారు.
ఈ దశలో నిఖిల్ కుమార్ (67: 77 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసినా.. అతనికి ఎవరూ సహకారం అందించలేదు. టీమ్ స్కోరు 174 వద్ద నిఖిల్ ఔట్ అయిపోవడంతో.. భారత్ ఓటమి ఖాయమైపోయింది. చివరికి భారత్ జట్టు 47.1 ఓవర్లలో 238 పరుగులకి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో అలీ రాజా 3 వికెట్లు, అబ్దుల్, పహామ్ చెరో రెండు, నవీన్ ఉస్మాన్ చెరో వికెట్ పడగొట్టారు.
రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే
భారత్ జట్టు నెక్ట్స్ మ్యాచ్‌ను సోమవారం జపాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి షార్జా ఆతిథ్యం ఇవ్వనుండగా.. బుధవారం యూఏఈతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా షార్జాలోనే ఆడనుంది. గ్రూప్-ఎలో ఉన్న భారత్ జట్టు సెమీస్‌కి చేరాలంటే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.