BEL Machilipatnam Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌ మచిలీపట్నంలో ఇంజనీర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…-engineering jobs in andhra pradesh bel machilipatnam hiring ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bel Machilipatnam Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌ మచిలీపట్నంలో ఇంజనీర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

BEL Machilipatnam Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌ మచిలీపట్నంలో ఇంజనీర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 04, 2024 10:45 AM IST

BEL Machilipatnam Jobs: మచిలీపట్నం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌‌ను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మచిలీపట్నం బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
మచిలీపట్నం బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL Machilipatnam jobs: కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖకు చెందిన నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్‌ మచిలీపట్నంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బెల్‌ పరిశ్రమను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రక్షణ రంగ అవసరాల కోసం ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తయారు చేయనున్నారు. ఈ సంస్థలో ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

బెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 8 ఖాళీలను భర్తీ చేస్తారు. మెకానికల్ విభాగంలో 12 పోస్టులను భర్తీ చేస్తారు. తాత్కాలిక పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెలకు రూ.40వేల వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తుదారులు గరిష్టంగా 32ఏళ్లలోపు వయస్కులై ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 35, ఎస్సీ,ఎస్టీలకు 37ఏళ్ల వరకు సడలింపు ఇస్తారు. మొత్తం ఉద్యోగాల్లో అన్‌ రిజర్వ్‌డ్ క్యాటగిరీలో 8, ఈడబ్ల్యూఎస్‌లో 2, ఓబీసీలో 5, ఎస్సీలో 3, ఎస్టీలకు 2 పోస్టులు ఉన్నాయి. 40శాతం కంటే వైకల్యం ఉన్న వికలాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు.

విద్యార్హతలు...

ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నాలుగేళ్ల బిఇ, బిటెక్‌ ఇంజనీరింగ్ డిగ్రీలను ఎలక్ట్రానిక్స్‌, ఈసీఈ, టెలి కమ్యూనికేషన్స్‌, డిగ్రీలను కలిగి ఉండాలి. మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు బిఇ, బిటెక్‌, బిఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీలో పూర్తి చేసి ఉండాలి. పార్ట్‌ టైమ్‌, దూర విద్యలో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు కాదు.

ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా నాలుగేళ్ల వరకు కొనసాగిస్తారు. వ్యక్తిగత పనితీరు ఆధారంగా నాలుగో ఏడాది కొనసాగింపు ఉంటుంది. మొదటి ఏడాది రూ.40వేలు, రెండో ఏడాది రూ.45వేలు, మూడో ఏడాది రూ.50వేలు, నాలుగో ఏడాది రూ.55వేల వేతనం చెల్లిస్తారు. నాలుగేళ్ల పాటు బెల్‌లో ఇంజనీర్లుగా పనిచేసిన వారికి నాలుగో ఏడాది ఏడాదికి రూ.25వేల చొప్పున నాలుగేళ్లకు లక్ష రుపాయల బోనస్ చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ12వేల వార్షిక అలవెన్సు కూడా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు మచిలీపట్నం వెలుపల పనిచేయాల్సి ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ లింక్ ద్వారా గూగుల్ ఫార్మ్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 12వ తేదీ వరకు గడువు ఉంది.

ఎంపికలు ఇలా...

బెల్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులకు డిసెంబర్ 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్‌ మెకానికల్ పోస్టులకు ఉదయం 11.30గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షలో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. 90నిమిషాల వ్యవధిలో 85 ప్రశ్నలకు మల్టిపుల్ ఛాయిస్‌ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:5 రేషియోలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తుతో పాటు రూ.472 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. బెల్‌ ఇంజనీర్ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=14842 ఈ లింకును అనుసరించండి.

బెల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం ఈ లింకును అనుసరించండి.. https://bel-india.in/job-notifications/

Whats_app_banner