Vivah Panchami: వివాహ పంచమి రోజున ఈ పనులు చేశారంటే భార్యభర్తలను ఎవ్వరూ విడదీయ లేరు! చేయకూడని పనులు కూడా ఉన్నాయి
Vivah Panchami: హిందూ పండగల్లో వివాహ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసం శుక్లపక్షం ఐదవ రోజున వచ్చే పంచమి నాడు సీతారాములను పూజించడం వల్ల శుభపలితాలు కలుగుతాయి. ఈ రోజున దంపతులిద్దరూ కలిసి ఈ పనులు చేశారంటే వారి మధ్య గొడవలే రావని విశ్వాసం.
సనాతన ధర్మం ప్రకారం ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వివాహ పంచమి పండుగను జరుపుకుంటారు. ధ్రుక్ పంచాంగం ప్రకారంఈ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన వివాహ పంచమి జరుపుకుంటారు.ఈ రోజును సీతా, రాముల వివాహ వార్షికోత్సవంగా చెబుతారు. రామాయణం ప్రకారం.. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజునే రాముడు స్వయంవరంలో సీతను గెలిచి వివాహం చేసుకున్నాడు. కనుక ఈ ప్రత్యేక తిథి నాడు వైవాహిక జీవితంలో ఆనందం, సంతోషం కోసం దంపతులిద్దరూ కలిసి శ్రీరామచంద్రుడు, సీతాదేవీలను పూజించాలని హిందువుల నమ్మకం. వివాహ పంచమి రోజున వ్రతం చేసినా పూజ చేసినా భక్తుని అన్ని మనోవాంఛలన్నీ తీరతాయని, జీవితంలో సుఖ-సమృద్ధి, ఆనందం కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా వైవాహిక జీవితం, వివాహం వంటి విషయాల్లో సమస్యలు ఉన్నవారు ఈ రోజు సీతారాములను భక్తితో ఆరాధిస్తే వారికున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని చెబుతారు. వివాహ పంచమి రోజున సీతారాములకు కొన్నింటిని అర్పించడం వల్ల మరిన్ని శుభఫలితాలు దక్కుతాయాని హిందూ ఆచారాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
వివాహ పంచమి రోజున సీతారాములకు అర్పించాల్సినవి:
పంచామృతం- వివాహ పంచమి రోజున పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపి తయారు చేసిన పంచామృతాన్ని సీతారాములకు అర్పించడం చాలా అవసరం. దీనివల్ల వైవాహిక జీవితంలోని అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడతాయని విశ్వాసం.
కేసరి - పురాణాల ప్రకారం శ్రీరామ చంద్రుడికి కేసరి అంటే చాలా ఇష్టం. వివాహ పంచమి రోజున సీతారాములను పూజించే సమయంలో నైవేథ్యంగా కేసరిని పెట్టారంటే రాముడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఫలితంగా జీవితంలో సుఖం, శాంతి, ఆనందం కలుగుతాయని నమ్మకం.
కందమూలం,ఫలాలు - వివాహ పంచమి రోజు సీతామాత, శ్రీరాముడి ఆశీర్వాదాలను పొందేందుకు వారి పూజలో కందమూలం, పండ్లు వంటివాటిని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు.
పాయసం -వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండి పోవాలంటే వివాహ పంచమి రోజున సీతారాములను పూజించేటప్పుడు పాయసం సమర్పించడం మర్చిపోవద్దు. వీరికి పాయసం సమర్పించారంటే ధన సమస్యలన్నీ తోలగిపోతాయని, సుఖ సమృద్ధి లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున రామ-జానకీ స్తుతి పఠనం మరియు వ్రతం చేయడం చాలా లాభదాయకంగా భావించబడుతుంది. దీని ద్వారా దాంపత్య జీవితం లో సౌమ్యత మరియు ప్రేమ పెరిగిపోతుంది.
వివాహ పంచమి రోజు చేయాల్సిన పనులు:
- వివాహ పంచమి రోజు సీతారాములకు ప్రత్యేకంగా పూజలు చేయడం చాలా శుభకరమైనది. వారి సనాతన ప్రేమ, ధర్మ పరిరక్షణను స్మరించుకుంటూ పూజలు చేయడం ద్వారా జీవనంలో సుఖసంతోషాలు, శాంతి లభిస్తాయి.
- ఈ రోజున దంపతులిద్దరూ కలిసి సీతారాముల వ్రతాన్ని జరిపితే వివాహ జీవితంలో శుభలాభాలు కలుగుతాయని నమ్మకం. దంపతులు పరస్పరం ప్రేమను, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలి.
- ఈ రోజు రామ-జానకీ స్తుతి, మంగళ వాక్యాలు పఠించడం, ఉపవాసం ఉండటం పవిత్రంగా పరిగణించబడతాయి.
- వివాహ పంచమి రోజు రామ-సీతా వివాహం గురించి కళ్యాణం చేయడం లేదా చూడటం ద్వారా వివాహ జీవితంలో వైవిధ్యం, ఆనందం, శాంతి, ప్రేమ పెరిగుతాయని నమ్మకం.
- వివాహ పంచమి రోజున సీతా మాతకు గాజులు, పసుపు, కుంకుమ, చీర వంటివి పెట్టాలి. ఇంట్లోకి ముత్తయిదువులను పిలిచి వారికి వీటిని వాయనంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తీరతాయి. నిండు నూరేల్లు ముత్తయిదువుగా జీవిస్తారు.
వివాహ పంచమి రోజున చేయకూడని పనులు:
- వివాహ పంచమి రోజున, దంపతులు మధ్య వాగ్వివాదానికి తావులేకుండా చూసుకోవాలి. పరస్పరం ప్రేమను పెంచుకోవడం ఉత్తమం.
- ఈ రోజు మాంసాహారం, మద్యం లేదా ధూమపాన వినియోగం చేయకూడదు.ఈ రోజంతా శుద్ధిగా, పవిత్రతతో నిండి ఉండాలి.
- వివాహ పంచమి రోజున పెద్దలు, గురువులను అవమానించకూడదు. వారి ఆశీర్వాదాలు మీకు చాలా ముఖ్యం.
- కోపం, హింస: ఈ రోజు ఏ విధమైన హింస, కోపంతో అరవడం, ఇతరుల మీద చేయిచేసుకోవడం వంటి అశుభకార్యాలను చేయడం చాలా దోషకరం. ఈ రోజు శాంతి, సద్గుణాల ప్రకాశం కావాలి.