Brahmamudi December 4th Episode: భార్యకు రాజ్ విడాకులు -కొడుకుపై చెయ్యెత్తిన అపర్ణ -దుగ్గిరాల ఇంట్లోకి కావ్య రీఎంట్రీ
Brahmamudi: బ్రహ్మముడి డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో రాజ్‌లో మార్పు కోసం భర్తకు విడాకుల నోటీసులు పంపిస్తుంది అపర్ణ. కానీ తల్లి ప్లాన్‌ను తిప్పికొడతాడు రాజ్. తండ్రికి పంపించిన విడాకుల నోటీసు వెనక్కి తీసుకోకపోతే తాను కావ్యకు విడాకులు ఇస్తానని అపర్ణను హెచ్చరిస్తాడు.
Brahmamudi December 4th Episode: రాజ్‌లో మార్పు తీసుకొచ్చేందుకు భర్త సుభాష్‌కు విడాకుల నోటీసు పంపిస్తుంది అపర్ణ. అత్తయ్య చేసిన పని కావ్యకు నచ్చదు. నా కాపురం కోసం మీ సంసారాన్ని పాడుచేసుకోవద్దని అపర్ణతో అంటుంది. కావ్య ఎంత చెప్పిన అపర్ణ వినకపోడంతో...అత్తయ్యను తన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది కావ్య. నేను పోను అంటే ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నావని కావ్యతో వాదనకు దిగుతుంది అపర్ణ. నేనే మీతో ఈ విడాకుల పంపించానని రాజ్ కోపంలో ఉన్నాడని కావ్య చెబుతుంది.
విడాకుల నోటీస్ వాపసు...
మీ విడాకుల నోటీసు వాపసు తీసుకుంటున్నానని సుభాష్‌కు వెంటనే ఫోన్ చేయమని అపర్ణతో అంటుంది కావ్య. ఏం జరిగినా నేను చూసుకుంటానని కావ్య మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అపర్ణ వెళ్లిపోతుంది. అపర్ణతో ఈ విడాకుల నాటకం ఆడించింది తల్లి అని కావ్య అనుమానిస్తుంది. కనకాన్ని దులిపేస్తుంది.
డాక్యుమెంట్స్ రెడీ...
తాను బతికి ఉండగా మిమ్మల్ని విడిపోనివ్వను...ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వను అని తల్లిదండ్రుల ఫొటో చూస్తూ రాజ్ అంటాడు. డాక్యుమెంట్స్ సిద్ధం చేశారా...మార్నింగ్ లోగా పేపర్స్ నా చేతిలో ఉండాలని ఓ వ్యక్తితో చెబుతాడు.
అపర్ణ ఆశీర్వాదం...
కార్తీక మాసం సందర్భంగా అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. నీకు రాజ్‌కు మధ్య దూరం తొలిగిపోవాలని కోడలిని ఆశీర్వదిస్తుంది అపర్ణ. అప్పుడే రాజ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ఉగ్రమూర్తిలా కోపంగా రావడం చూసి కావ్య కంగారుపడుతుంది. వచ్చి రావడంతోనే ఏం పంపించావ్ అని తల్లితో కోపంగా మాట్లాడుతాడు రాజ్. సంస్కారంతో పాటు చదువు మర్చిపోయావా అని అపర్ణ సెటైర్ వేశాడు. ఆ పేపర్స్ ఎందుకు పంపించావో...వాటి వెనుక అంతరార్థం ఏమై ఉంటుందో అంత తెలుసుకొనే వచ్చానని అంటాడు.
కావ్యకు విడాకులు...
నేను తెచ్చిన ఈ పేపర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందని తల్లితో రాజ్ అంటాడు. ఏం పేపర్స్ భర్తను అడుగుతుంది కావ్య. మన విడాకుల పేపర్స్ అని రాజ్ సమాధానం ఇవ్వడంతో అందరూ షాకవుతారు. కనకం, కావ్య మాటలు నమ్మి నాపై ఆస్త్రం ప్రయోగించాలని అనుకుంటున్నావేమో...తిరుగులేని అస్త్రంతో తిప్పికొట్టడానికే ఈ పేపర్స్ తెచ్చానని అంటాడు. ఇన్ని అనర్థాలకు మూల కారణమైన కావ్యకు విడాకులు ఇచ్చి శాశ్వతంగా వదిలించుకోవాలని అనుకుంటున్నానని రాజ్ తన నిర్ణయం చెప్పేస్తాడు.
నా భార్య కావడమే కళావతి చేసిన పాపం...
నువ్వు కళావతి కోసం ఏ పాపం తెలియని నాన్నకు విడాకులు ఇవ్వాలని అనుకున్నావు...నువ్వు చేసిన పని వల్ల నేను కళావతికి విడాకులు ఇద్దామని అనుకుంటున్నాను. నా భార్య కావడమే కళావతి చేసిన పాపం అని రాజ్ అంటాడు. రాజ్ మాటలతో అపర్ణ కోపం పట్టలేక రాజ్‌ను కొట్టడానికి చెయ్యేత్తుతుంది.
గొడవ నాకు...ఈ కళావతికే కదా...మధ్యలో ఇళ్లు ఏం చేసింది. నాన్న, నేను ఏం చేశాం. మన కుటుంబ పరువు ప్రతిష్టల కంటే కళావతి ముఖ్యమని ఇంత దూరం వచ్చావు. ఈ రోజు నువ్వు చేసిన పనే నేను చేస్తున్నాను.
నువ్వు చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పేలా అవుతుంది. ఏ పేపర్స్ చూపించి నన్ను భయపెట్టాలని అనుకున్నావో...నేను అదే పద్దతిలో నడిచి మీకు తిరుగులేని జవాబు చెప్పాలని వచ్చానని రాజ్ అంటాడు.
నువ్వు మాత్రమే రావాలి...
నాన్నకు పంపించిన విడాకుల నోటీసును వెనక్కి తీసుకొని వెంటనే తనతో పాటు ఇంటికి వచ్చేయమని తల్లికి ఆర్డర్ వేస్తాడు రాజ్. నీ కోడలే ముఖ్యమని, పంతం పట్టుదలకు పోతే నీ కోరిక జీవితంలో నెరవేరదని రాజ్ అంటాడు. నువ్వు మాత్రమే నాతో రావాలి. ఇంకా ఎవ్వరూ వద్దు అని అది కూడా గుర్తుపెట్టుకోమని తల్లితో అంటాడు రాజ్. రాజ్ మాటలు విని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నువ్వు మాట్లాడటానికి, నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని కావ్యతో రాజ్ అంటాడు. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన సీతారామయ్య రాజ్ మాటలను భరించలేక అతడి చెంప పగలగొడతాడు.
నీ పతనానికి టైమ్ ఉంది...
సమయం ఎవరికి ఇస్తున్నావ్...దేనికి ఇస్తున్నావ్...నీ పతనానికి ఇంకా టైమ్ ఉందని చెబుతున్నావా అంటూ రాజ్‌ను నిలదీస్తాడు సీతారామయ్య. దిగజారి పోయిన నీ వ్యక్తిత్వాన్ని చూపించడానికా, కనుమరుగైపోయిన అనుబంధాలను శూన్యంలో చూడటానికి సమయం ఇస్తున్నావా అని క్లాస్ ఇస్తాడు.
నీ కోసం, నీ కాపురం, భవిష్యత్తు కోసం మహారాణిలా బతికిన మీ అమ్మ ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తుంటే...ఆమెను వెనక్కి రప్పించడం కోసం ఇంతలా దిగజారుతావా అంటూ దులిపేస్తాడు. ఓ ఆడపిల్ల కలలు, ఆశలు పణంగా పెడతావా. నీ భార్య సహనాన్ని నీ అహంకారంతో బలిచేసే హక్కు నీకు ఎవరిచ్చారని ఫైర్ అవుతాడు.
చదువు, సంస్కారం ఏమయ్యాయి...
నీ చదువు, సంస్కారం..ఉన్నత భావాలు అన్ని ఏమైపోయాయని రాజ్‌ను నిలదీస్తాడు. నీ అహం వాటిని మింగేసిందా అని ప్రశ్నిస్తాడు. నా వంశంలో నీ లాంటి భ్రష్టుడు పుడతాడని అనుకోలేదని చెబుతాడు.
కావ్యను ఎందుకు వద్దనుకుంటున్నావో...ఆమె ఏం నేరం చేసింది...ద్రోహం చేసిందో ఆమె కళ్లల్లోకి చూసి చెప్పమని రాజ్‌ను అడుగుతుంది ఇందిరాదేవి.
మూర్ఖుడికి ఇచ్చి పెళ్లిచేశాం...
కావ్యను నీకు ఇచ్చి పెళ్లి చేసి..ఆమె నిండు నూరేళ్ల జీవితాన్ని చిదిమేశామని, మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేశామని తెలుసుకోలేకపోయామని ఇందిరాదేవి అంటుంది. కావ్య నాకు భగవంతుడు ఇచ్చిన మనవరాలు...ఇంటి వారసురాలు అని తన నిర్ణయం చెబుతాడు సీతారామయ్య. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా...నచ్చిన నచ్చకపోయినా...కావ్య దుగ్గిరాల ఇంటి కోడలిగా శాశ్వతంగా మనింట్లోనే ఉంటుందని ప్రకటిస్తాడు. కాదనే హక్కు...పొమ్మనే హక్కు నీతో పాటు ఎవరికి లేదని అంటాడు.
కావ్య, రాజ్ విడిపోకుండా అడ్డుకున్న సీతారామయ్య, ఇందిరాదేవిలకు కృతజ్ఞతలు చెబుతారు కనకం, కృష్ణమూర్తి.
మబ్బులు కమ్మేశాయి...
ఏ ధైర్యంతో నేను ఇంటికి రావాలి...రాజ్ మాటల్లో ఏ ప్రమాణాలు ఉన్నాయని రావాలని సీతారామయ్యను అడుగుతుంది కావ్య. రాజ్ మనసులో నీ మీద ప్రేమలేదని అనిపిస్తే..మేమే నీకు మరో వ్యక్తిని ఇచ్చి పెళ్లి జరిపించేవాళ్లమని సీతారామయ్య బదులిస్తాడు. రాజ్ ప్రేమను మబ్బులు కమ్మేశాయని, నీ సహనమే రాజ్‌లో మార్పు తీసుకొస్తుందని సీతారామయ్య అంటాడు.
వెలుగు మొత్తం పోయింది...
నువ్వు ఎప్పుడైతే మా ఇళ్లు దాటావో...అప్పుడే మా ఇంట్లో వెలుగు మొత్తం పోయిందని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మీ సంసారం చెల్లచెదురై పోయి...ఎవరికి వారే అయిపోతారు. రాజ్ జీవితంతో పాటు నీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని కావ్యకు సర్ధిచెబుతుంది ఇందిరాదేవి.
రాజ్ తరఫున...
నువ్వు వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సీతారామయ్య అంటాడు. కావాలంటే రాజ్ తరఫున నీ కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు. అంత మాట అనోద్దు...మీ అందరి సంస్కారం ముందు నేను ఎంతో చిన్నదానిని అయిపోయానని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ చల్లని నీడలో మీ మనవరాలిగా బతికే భాగ్యం దొరికినందుకు సంతోషంగా ఉందని అంటుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకంతో నా కాపురం నిలబెట్టుకోవడానికి తిరిగి ఇంటికి వస్తానని కావ్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.