AP Rajyasabha ‍Elections: నేటి నుంచి ఏపీలో రాజ్యసభకు నామినేషన్లు, పోటీకి నాగబాబు విముఖత-nominations for rajya sabha in ap from today nagababu reluctant to contest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rajyasabha ‍Elections: నేటి నుంచి ఏపీలో రాజ్యసభకు నామినేషన్లు, పోటీకి నాగబాబు విముఖత

AP Rajyasabha ‍Elections: నేటి నుంచి ఏపీలో రాజ్యసభకు నామినేషన్లు, పోటీకి నాగబాబు విముఖత

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 09:59 AM IST

AP Rajyasabha ‍Elections: ఆంధ్రప్రదేశ్‌‌లో రాజ్యసభ ఎన్నికలు అగ్గిరాజేస్తున్నాయి. రాజ్యసభ రేసు నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తప్పుకున్నారు. పోటీకి నాగబాబు విముఖత చూపినట్టు తెలుస్తోంది. పదవీ కాలం తక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాలతో పోటీ చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఆసక్తి రేపుతున్న ఏపీ రాజ్యసభ ఎన్నికలు
ఆసక్తి రేపుతున్న ఏపీ రాజ్యసభ ఎన్నికలు (ANI )

AP Rajyasabha ‍Elections: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పేర్ల స్థానంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు జనసేన తరపున సినీనటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాగబాబు విముఖత చూపినట్టు తెలుస్తోంది. మోపిదేవి స్థానంలో నాగబాబుకు అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే పదవీ కాలం చాలా తక్కువగా ఉండటంతో పాటు ఎన్నిక కాకుండా రాజ్యసభకు వెళ్లడంపై నాగబాబు ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని నాగబాబు భావించారు. అయితే ఎన్నికల పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. ఆ సమయంలో నాగబాబు మనస్తాపానికి గురయ్యారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా హైదరాబాద్‌ వెళ్లిపోవడంతో పవన్ కళ్యాణ్ బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతుడటంతో నాగబాబుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.

మోపిదేవి పదవీ కాలం రెండేళ్లలోపు ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే నాగబాబు రాజ్యసభకు వెళ్లడం లేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని జనసేన ప్రతిపాదించలేదని టీడీపీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి

నాగబాబు పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో సాన సతీష్‌ పేరు తెరపైకి వచ్చింది. సతీష్ పేరును ప్రతిపాదించడంపై టీడీపీ, జనసేనల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యసభ పదవులకు రాజీనామాలు చేసిన సమయంలో మరోసారి అవకాశం కల్పిస్తామని బీద మస్తానరావుకు హామీ లభించినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీ తరపున బీద మస్తానరావు, సాన సతీష్‌లను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ తరపున ఆర్‌.కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. ఆర్‌ కృష్ణయ్య స్థానంలో గల్లా జయదేవ్‌ పేరు ప్రచారం జరిగినా తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ కూడా ఆంద్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ప్రాతినిథ్యం కోరుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల గడువు ఉండటంతో పేర్లను ఖరారు చేయడానికి మరికొంత సమయం పట్టనుంది.

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. గత వారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలోనే రాజ్యసభ అభ్యర్థిత్వాల అంశం తెరపైకి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతు కోరినట్టు వార్తలు వచ్చాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకట రమణకు 2026 జూన్ 21 వరకు పదవీ కాలం ఉండగా 2024 ఆగస్టు 29న రాజీనామా చేశారు. తనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మోపిదేవి అప్పట్లో స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు చంద్రబాబుకు కూడా తన అభిమతం వెల్లడించినట్టు మోపిదేవి స్పష్టం చేశారు.

వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు, ఆర్‌ కృష్ణయ్యలకు 2028 జూన్ 21 వరకు పదవీ కాలం ఉంది. బీద మస్తాన్‌ రావు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తారనే హామీతో పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఆర్‌ కృష్ణయ్య వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు.

డిసెంబర్ 3 మంగళవారం నుంచి రాజ్యసభ నామినేషన్లు మొదలవుతాయి. డిసెంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13న ఉపసంహరణ జరుగుతుంది. డిసెంబర్ 20వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 24 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలకు 164మంది సభ్యుల బలం ఉంది. దీంతో మూడు స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కనున్నాయి.

Whats_app_banner